Rohit Hardik practice : వైవాహిక జీవితంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన మునుపటి క్రికెట్ ఆడలేక పోతున్నాడు. ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. అందువల్లే అతడు గొప్పగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతడిని త్వరలో స్వదేశం వేదికగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు (England cricket team) తో జరిగే టి20 సిరీస్ కు టీం ఇండియా మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఈనెల 22 నుంచి ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా 5 t20 ల సిరీస్ ను మొదలు పెడుతుంది. అయితే ఈ సిరీస్లో తన సత్తాను చాటడానికి హార్దిక్ పాండ్యా తహతలాడుతున్నాడు. ఇందులో భాగంగా మైదానంలో చెమటోడ్చుతున్నాడు.. నవీ ముంబై(Navi Mumbai)లోని ఓ మైదానంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతనితోపాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నెట్స్ లో బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించాడు. కొంతకాలంగా రోహిత్ శర్మ సరైన క్రికెట్ ఆడటం లేదు. టెస్టులలో వరుసగా విఫలమవుతున్నాడు. రెండంకెల స్కోర్ కూడా చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో మెరుగైన పరుగులు చేసినప్పటికీ.. అదే ఫామ్ చివరి వరకు కంటిన్యూ చేయలేకపోయాడు. దీంతో రోహిత్ పై విమర్శలు మొదలయ్యాయి. ప్రస్తుతం అతడు టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. వన్డే, టెస్ట్ ఫార్మేట్ లో మాత్రం కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.. తన ఆటతీరును పూర్తిగా మార్చుకోవడానికి రోహిత్ శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు..
తీవ్రంగా సాధన
ఇంగ్లాండ్ జట్టుతో టీ20, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఫిబ్రవరిలో దుబాయ్ వెళ్లిపోతుంది. అక్కడ జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ (champions trophy 2025) లో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్ లు మొత్తం హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు.. ఈ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది.. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ విజ్ఞప్తి చేయడంతో.. ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత ఆసియా కప్ లోనూ టీమిండియా హైబ్రిడ్ విధానంలోనే మ్యాచ్లను ఆడింది.. టీమిండియా కు ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత ముఖ్యం కావడం.. గత సీజన్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా చరమాంకంలో ఉంది. ఇటీవల అతని ఆధ్వర్యంలోనే టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ఓడిపోవడం… టీమిండియా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను కోల్పోవడంతో.. ఆ రెండు ఓటములను మరిపించేందుకు ఖచ్చితంగా టీమిండియా కు ఛాంపియన్స్ ట్రోఫీని అందించాలని రోహిత్ శర్మ ఉత్సాహ పడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టుకు అందించి.. టి20, మినీ వరల్డ్ కప్ లాంటి ఛాంపియన్స్ ట్రోఫీలు అందించి గౌరవంగా తప్పుకోవాలని భావిస్తున్నాడు. అందువల్లే రోహిత్ శర్మ తీవ్రంగా సాధన చేస్తున్నాడు.. నవీ ముంబైలో విపరీతంగా నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.. కఠినమైన బంతులను ఎదుర్కొంటున్నాడు. ఆఫ్ స్టంప్ బంతులను పదేపదే ఆడుతున్నాడు. తన వైఫల్యాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాడు.