
Rajasthan Vs Gujarat IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో మ్యాచ్‌లు రంజుగా సాగుతున్నాయి. ఒక మ్యాచ్‌ను మించి మరో మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తోంది. చివరి బంతి వరకూ విజయం రెండు జట్లను ఊరిస్తోంది. రంజుగా సాగుతున్న ప్రతీ మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా అలాంటి ఒక మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది. గుజరాత్–రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో రాజస్థాన్ విజయం సాధించింది. రాజస్థాన్ విజయంలో హెహిట్‌మైర్, సంజూ శాంమ్‌సన్ కీలకపాత్ర పోషించారు.
కొనసాగుతున్న రాజస్థాన్ జోరు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది. ఆ జట్టు వరుసగా మూడో విజయాన్నందుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్‌మైర్(26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి 30 బంతుల్లో ధృవ్ జురెల్, అశ్విన్ సాయంతో హెట్‌మైర్ 65 పరుగులు రాబట్టి చిరస్మరణీయ విజయాన్నందించాడు.
గుజరాత్ భారీ స్కోరు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. టీ20లో 177 పరుగులు సాధారణ స్కోరేం కాదు. 150 పరుగులకు పైన చేశారంటే.. టార్గెట్ ఛేదనలో ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 45) టాప్ స్కోరర్లుగా నిలవగా.. హార్దిక్ పాండ్యా(28), అభినవ్ మనోహర్(27) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్‌శర్మ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.
చిన్నబోయిన భారీ లక్ష్యం..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసి గెలుపొందింది. హెట్‌మైర్‌కు తోడుగా కెప్టెన్ సంజూ శాంసన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో భారీ లక్ష్యం చిన్నపోయింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. రషీద్‌ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

టాపార్డర్ కుప్ప కూలినా..
లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్ టాప్–3 బ్యాటర్లు యశస్వి జైస్వాల్(1), జోస్ బట్లర్(0), దేవత్ పడిక్కల్(26) దారుణంగా విఫలమయ్యారు. రియాన్ పరాగ్(5) కూడా ఔటవ్వడంతో 55 పరుగులకే రాజస్థాన్ ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో షిమ్రాన్ హెట్‌మైర్‌తో కలిసి సంజూ శాంసన్ జట్టును ఆదుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సంజూ శాంసన్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సంజూ జోరుకు ఇంపాక్ట్ ప్లేయర్ నూర్ అహ్మద్ బ్రేక్ వేయడంతో ఐదో వికెట్‌కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధృవ్ జురెల్(17)తో కలిసి హెట్‌మైర్ చెలరేగాడు. 25 బంతుల్లోనే హెట్‌మైర్ హాఫ్ సెంచరీ బాదగా.. ధృవ్ జురెల్(17), రవిచంద్రన్ అశ్విన్(10) ను మహమ్మద్ షమీ ఔట్ చేశాడు. దాంతో రాజస్థాన్ విజయానికి చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమవ్వగా.. హెట్‌మైర్ క్విక్ డబుల్‌తోపాటు సిక్స్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
గుజరాత్‌ను చివరి వరకూ ఊరించిన విజయానికి హెట్‌మైర్, సంజూ శాంసన్ రూపంలో తన్నుకుపోయారు. రాజస్థాన్‌కు చిరస్మరణీయమైన విజయం అందించారు.