
Crown Act Bill: బాబర్ పాలనలో జుట్టు పొడుగ్గా పెంచుకోవడం నిషేధం.. మొగలాయిల కాలంలో గోర్లు పెంచుకుంటే పన్నులు విధించేవారు. అదంటే వెనుకటి కాలం.. కానీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడో కాదు భయ్యా…మనం ఆశల స్వర్గం, కొలువుల సౌధం అని తెగ పొగిడే అమెరికాలో.. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది మిలియన్ డాలర్ల నిజం.
మన ఇంట్లో, లేదా చుట్టుపక్కల ఎవరైనా జుట్టు పెంచుకుంటే.. “అది జుట్టా, కలుపు మొక్కా, గొర్రె బొచ్చుకు, ఈ జుట్టుకు ఏమన్నా తేడా ఉందా? నల్ల జుట్టు ఉంటే ఉద్యోగానికి ఏం పనికొస్తారు” అని దెప్పి పొడిస్తే ఎలా ఉంటుంది? లాగి చెంప మీద నుంచి ఒక్కటి ఇస్తారు..నా జుట్టు నా ఇష్టం మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటని ప్రశ్నిస్తారు.. కానీ అమెరికాలో అలా కాదు..అక్కడ నల్ల జట్టు నుంచి కాలి గోళ్ళ దాకా అన్నింటా వివక్ష రాజ్యమేలుతోంది. తాజాగా నల్ల జుట్టుపై వివక్షను నిషేధిస్తూ టెక్సాస్ హౌస్ బిల్లును ఆమోదించడంతో.. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భౌగోళిక వాతావరణాన్ని బట్టి అక్కడి ప్రజలు ఉంటారు. యూరప్ ప్రజలు తెల్లగా ఉంటారు. ఆఫ్రికన్ ప్రజలు ఎత్తుగా, నల్లగా, రింగులు కలిగిన జుట్టుతో ఉంటారు. అదే ఆసియాలో అయితే ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో తీరుగా ఉంటారు. కానీ జుట్టు నల్లగా, పొడవుగా రింగులు తిరిగి ఉంటే అమెరికన్లు సహించలేరు. కొప్పు బాగా కుదిరితే చక్కగా ఉందని మనదేశంలో అంటూ ఉంటాం. నల్ల జాతి అమ్మాయిలు రకరకాల హెయిర్ స్టైల్స్ తో కొప్పును గొప్పగా ప్రదర్శించడం కూడా అమెరికన్లకు నచ్చదు. స్కూళ్ళు, పని ప్రాంతాలు, నలుగురు కలిసే చోట.. ఇలా అంతటా ఈ వివక్ష తీవ్ర రూపు దాల్చింది. ఆఫ్రో బ్రయిడ్స్, డ్రెడ్ లాక్స్, కార్న్ రోస్ హెయిర్ స్టైల్స్ చేసుకునే వారిపై వివక్ష నానాటికి పెరిగిపోతుండడంతో టెక్సాస్ లోని ప్రతినిధుల సభ కల్పించుకుంది. నల్ల జుట్టుపై వివక్ష పనికిరాదు అంటూ క్రౌన్ ఆక్ట్ బిల్ ఆమోదించింది. మొదట్లో ఈ బిల్లును డెమొక్రాట్ సభ్యులు ప్రతి పాదిస్తే అవసరమా అని కొట్టి పడేశారు..కానీ ఇప్పుడు ఆ బిల్లు 143_5 ఓట్ల తేడాతో నెగ్గడం విశేషం.

ఇలా తెర పైకి
హ్యూస్టన్ లోని బార్బర్స్ హిల్ హైస్కూల్లో అధికారులు డెండ్రే ఆర్నాల్డ్ అనే ఏడో తరగతి విద్యార్థిపై చూపించిన వివక్ష ఈ బిల్లుకు కారణమైంది. ఆ విద్యార్థి జుట్టును పెంచుకుంటున్నాడు. అది ట్రినిడియాన్ల సంస్కృతిలో ఒక భాగం. జుట్టు కత్తిరించుకోకుంటే గ్రాడ్యుయేషన్ క్లాసులకు అనుమతించేది లేదని స్కూల్ అధికారులు తేల్చి చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు బతిమిలాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇది 2020లో జరిగింది. దీంతో ఆ విద్యార్థి బాధ ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టింది. అతడికి ప్రఖ్యాత టీవీ షో “ది ఎలెన్ డిజేనరస్” లో పాల్గొనే అవకాశం వచ్చింది. హెయిర్ లవ్ అనే షార్ట్ ఫిలిం తీసిన దర్శకుడు మాథ్యూ ఏ చెర్రీ ఆ అబ్బాయిని ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కు కూడా ఆహ్వానించాడు.. మరెందరో విద్యార్థులను జుట్టు పొడవుగా ఉందంటూ స్కూల్ నుంచి తీసేసిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ వివక్షను నిషేధిస్తూ చట్టం చేయాల్సి వచ్చింది.
అమెరికాలో నల్ల జుట్టుపై వివక్ష 18వ శతాబ్దం నుంచే ఉందని చరిత్ర చెబుతోంది. ఆఫ్రికన్ల జుట్టు గొర్రె బొచ్చు లాగా ఉంటుందని అప్పట్లో హేళన చేసేవారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ కు కూడా జుట్టుపై వివక్ష తప్పలేదు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా తన రింగుల జుట్టును సాఫీగా ఉండేలా చేయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె గత ఏడాది చెప్పారు.” ఒబామా వైట్ హౌస్ లో ఉండగా ఆయన పాలనపై కాకుండా నా జుట్టుపై ఎక్కడ చర్చ జరుగుతుందోనని హెయిర్ స్టైల్ మార్చుకున్నా. ఒక నల్ల జాతి కుటుంబం శ్వేత సౌధంలో ఉండడాన్ని సగటు అమెరికన్లు జీర్ణించుకోలేరు. దానికి తోడు నా జుట్టుపై వివాదం చెలరేగడం ఎందుకని దానిని సాఫీగా ఉండేలాగా చేసుకున్న” అని మిషెల్ వ్యాఖ్యానించింది.. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అమెరికాలో జుట్టుపై ఎలా వివక్ష ఉంటుందో..జట్టు మాత్రమే కాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో గోళ్ళు పెంచుకున్నా నిషేధం విధిస్తారు.