India vs New Zealand : స్వదేశంలో టీమిండియా బలమైన శక్తి. ఆస్ట్రేలియా నుంచి దక్షిణాఫ్రికా వరకు ఏ జట్టుకు కూడా లొంగని తత్వం టీమిండియా సొంతం. అంతటి బలమైన టీమిండియా ఇప్పుడు బలహీనంగా మారుతోందా? క్రమేపి తన శక్తిని మొత్తం కోల్పోతుందా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం గౌతమ్ గంభీర్ నిర్లక్ష్యమని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా కోల్పోవడం సగటు అభిమానిని ఆవేదనకు గురిచేస్తుంది. 2024లో టీమ్ ఇండియా పై న్యూజిలాండ్ 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిచింది. దీనికంటే ముందు నాలుగు ఐసిసి టోర్నీల తో పాటు వన్డే క్రికెట్ ఆడేందుకు 16 సార్లు న్యూజిలాండ్ భారత్ లోకి వచ్చింది. ఏ ఒక్క సందర్భంలో కూడా న్యూజిలాండ్ సానుకూల ఫలితం రాలేదు. కానీ, ఈసారి మాత్రం న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది. గౌతమ్ గంభీర్ మాత్రమే కాకుండా, గిల్ కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిమానులు చెబుతున్నారు.
భారత్ లో పర్యటిస్తున్న ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో 8 ప్లేయర్లు కొత్తవాళ్లే. అయినప్పటికీ అద్భుతంగా ఆడారు. సిరీస్ ను సొంతం చేసుకున్నారు. భారతదేశ జట్టులో మాత్రం ప్రణాళిక లోపాలు స్పష్టంగా కనిపించాయి. బౌలింగ్లో స్థిరత్వం లేదు. బ్యాటింగ్లో సామర్థ్యం లేదు. గందరగోళంగా వ్యూహాలు ఉన్నాయి. కనీసం పవర్ ప్లే లో మన బౌలర్లు వికెట్లు తీయలేకపోయారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సిరీస్ లో భారత బౌలర్లు ఓవర్ కు సగటున 6.2 పరుగులు ఇచ్చారు. గడిచిన దశాబ్ద కాలంలో భారత బౌలర్లు ఒక సిరీస్ లో ఈ స్థాయిలో పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. కులదీప్ యాదవ్ అత్యంత దారుణంగా బౌలింగ్ చేసాడు. బ్యాటర్లలో విరాట్, కేఎల్ రాహుల్ మాత్రమే తమ స్థాయి ఆట తీరు ప్రదర్శించారు. మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించడంలో భారత ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇక ఫీల్డింగ్ కూడా అత్యంత నాసిరకంగా ఉంది. గౌతమ్ గంభీర్ నిర్లక్ష్యం టీమిండియా ఓటమికి కారణమైంది. ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్న రవీంద్ర జడేజాను గౌతమ్ గంభీర్ ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు. అక్షర్ పటేల్ వంటి నాణ్యమైన ఆల్ రౌండర్ ను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీస్తోంది. గంభీర్ శిక్షకుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత గడ్డమీద న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్ లను టీమ్ ఇండియా కోల్పోయింది. ఇప్పుడు ఇక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ను కోల్పోవడంతో గౌతమ్ గంభీర్ మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
