Virat Kohli vs Ganguly : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత జట్టు ఓడిపోయిన తర్వాత వస్తున్న విమర్శలు జడివాన ఇంకా ఆగలేదు. ప్రతిరోజు ఎవరో ఒక మాజీ క్రికెటర్ టీమిండియాపై విమర్శలను గుప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా డబ్ల్యూటిసి ఫైనల్ ఆడిన జట్టులోని స్టార్ ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లక్ష్యంగా భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ విమర్శలు గుప్పించాడు.
భారత జట్టు గత పదేళ్లుగా ఐసీసీ నిర్వహించిన ఏ టోర్నీని కూడా గెలవలేకపోయింది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్దిరోజుల కిందట జరిగిన డబ్ల్యుటిసి ఫైనల్ లో ఓటమి తర్వాత మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జట్టులోని ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గెలవాలన్న కసి, పట్టుదల ఆటగాళ్లలో లోపించడం వల్లే ఓటమిపాలవుతోందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ విరాట్ కోహ్లీ లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి.
దూకుడు మాత్రమే ఉంది.. ఆట లేదంటూ విమర్శలు..
టీమిండియాలో దూకుడు మాత్రమే కనిపిస్తోందని, ఒకప్పటి ఆట కనిపించడం లేదంటూ భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఒకప్పుడు భారత జట్టులో దూకుడుకు మారుపేరుగా నిలిచిన గంగూలి ఇప్పుడు కోహ్లీని ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. మొన్నటి వరకు గంగూలిని, కోహ్లీని పోల్చి చూసేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే, అటువంటి కోహ్లీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన గంగూలి గెలవడానికి దూకుడు ఒక్కటే ఉంటే సరిపోదని, ఆట కూడా ఉండాలని చెప్పుకొచ్చాడు. అయితే, గంగూలి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా టీమ్ ఇండియాను ఉద్దేశించి చేసినప్పటికీ పరోక్షంగా కోహ్లీని ఉద్దేశించి అన్నట్టుగా ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.
నిలకడగా రాణించాలంటూ క్రికెటర్లకు సూచన..
గంగూలి మరిన్ని విషయాలపై మాట్లాడుతూ అగ్రెషన్ ఉండటం ఒక్కటే గెలవడానికి మార్గం కాదని స్పష్టం చేశారు. అగ్రెసివ్ యాటిట్యూడ్ తోపాటు ఆట కూడా ఉండాలని స్పష్టం చేశారు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా 2001 నుంచి 2006 మధ్య కాలంలో నిలకడగా రాణించిన విషయాన్ని ఈ సందర్భంగా గంగూలీ తెలియజేశాడు. అద్భుతమైన ఆట తీరు కనబరిచినప్పుడే మనలోని దూకుడుకు విలువ ఉంటుందని ఈ సందర్భంగా క్రికెటర్లకు ఆయన సూచించాడు. టెస్టుల్లో ఎప్పుడైనా తొలి ఇన్నింగ్స్ లో చేసే స్కోర్ చాలా కీలకమని, ప్రత్యర్థి ఎదుట కనీసం 350 నుంచి 400 పరుగులు లక్ష్యాన్ని ఉంచి మానసికంగా దెబ్బతీయడం ద్వారా విజయం సాధించవచ్చని వివరించాడు. కానీ, టీమిండియా గత కొన్నేళ్లుగా తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించలేకపోవడంతో ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచడంలో విఫలమవుతోందని గంగూలీ చెప్పుకొచ్చాడు. దాదా చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులను ఆలోచనకు గురి చేస్తున్నాయి.