
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనల నేపథ్యంలో క్రికెట్ లోకి “ఫిస్ట్ బంప్ (పిడికిళ్ల పలకరింపు)” అనే కొత్త రూల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. మొదటిగా ఈ రూల్ ని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అమలుపరచనుంది. మిగిలిన అన్ని క్రికెట్ జట్లు కూడా క్రికెట్ మైదానంలో అదే రూల్ ని ఫాలో అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆట ప్రారంభంలో కెప్టెన్ ల మధ్య కరచాలనం, ముగింపులో రెండు జట్ల మధ్య కరచాలనం ఇవ్వకూడదని ఆ క్రికెట్ జట్టు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. దీనిని శ్రీలంక పర్యటనలో అమలు చేయనున్నట్లు ఆ జట్టు కెప్టెన్ జో రూట్ వెల్లడించాడు.
ఇంగ్లాండ్ జట్టు ఇటీవల దక్షిణాప్రికాలో పర్యటించిన క్రమంలో ఆ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ జట్టు గాస్ట్రోఎంటరైటిస్, ఫ్లూతో బాధపడిందని జో రూట్ తెలిపారు. దక్షిణాఫ్రికాలో జట్టంతా అనారోగ్యం బారిన పడిన తరువాత తక్కువగా కాంటాక్ట్ కావాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని రూట్ చెప్పారు. ఇప్పుడు శ్రీలంక పర్యటనలో తాము షేక్ హ్యాండ్ లకు బదులు పిడికిళ్లతో పలకరించుకుంటామని(ఫిస్ట్ బంప్) జో రూట్ తెలియజేసారు.
ముందు అనుకున్న ప్రకారం ఈ పర్యటన పూర్తిగా కొనసాగుతుందని అనుకుంటున్నామని.. అయితే, తమ జట్టు అధికారుల సలహా, సూచనల ప్రకారం ముందుకుసాగుతామని చెప్పారాయన. ఇంగ్లాండ్-శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ కు ముందు నిర్వహించనున్న రెండు వార్మప్ మ్యాచుల్లో మొదటిది శనివారం కటునాయకే స్టేడియంలో జరగబోతోంది.
శ్రీలంకలో ఇంగ్లండ్ టూర్ షెడ్యూల్
- మార్చ్ 7 – 9 : ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ XI, కటునాయకె స్టేడియం
- మార్చ్ 12 -15 : ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్ XI, కొలంబోలోని పీ సారా ఓవల్ మైదానం
- మార్చ్ 19 – 23 : మొదటి టెస్ట్, గాలె
- మార్చ్ 27 – 31 : రెండో టెస్ట్, కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం