IND vs AUS : బౌలర్లు బెంబెలెత్తించారు.. బ్యాటర్లు దంచికొట్టారు.. ఆస్ట్రేలియాను వణికించిన టీమిండియా

IND vs AUS : ఆస్ట్రేలియా ఇండియా గడ్డ మీద అడుగుపెట్టిన మరుక్షణం ‘స్పిన్ పిచ్’ల గోల మొదలైంది. ఇక నాగపూర్ పిచ్ దృశ్యాలు బయటకు రాగానే ఆస్ట్రేలియా మాజీలు, ఆటగాళ్లు గగ్గోలు పెట్టారు. ఇది ఖచ్చితంగా స్పిన్ పిచ్ అని.. ఎడమవైపు స్పిన్ తిరిగేలా చేస్తున్నారని.. ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ ఆడలేరని.. ఇక ఎడమచేతి బౌలర్లు ఉన్న టీమిండియా ఇలా కుట్ర చేస్తోందని గగ్గోలు పెట్టారు.. కట్ చేస్తే తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియానే […]

Written By: NARESH, Updated On : February 9, 2023 5:59 pm
Follow us on

IND vs AUS : ఆస్ట్రేలియా ఇండియా గడ్డ మీద అడుగుపెట్టిన మరుక్షణం ‘స్పిన్ పిచ్’ల గోల మొదలైంది. ఇక నాగపూర్ పిచ్ దృశ్యాలు బయటకు రాగానే ఆస్ట్రేలియా మాజీలు, ఆటగాళ్లు గగ్గోలు పెట్టారు. ఇది ఖచ్చితంగా స్పిన్ పిచ్ అని.. ఎడమవైపు స్పిన్ తిరిగేలా చేస్తున్నారని.. ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ ఆడలేరని.. ఇక ఎడమచేతి బౌలర్లు ఉన్న టీమిండియా ఇలా కుట్ర చేస్తోందని గగ్గోలు పెట్టారు.. కట్ చేస్తే తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియానే టాస్ గెలిచింది. మంచి పిచ్ పై ఆడలేక తడబడింది.

ఆస్ట్రేలియన్లు అనుమానించినట్టే మన ఎడమచేతి వాటం బౌలర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా మన జడేజా ఐదు వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. అయితే ఆస్ట్రేలియన్ల అంచనాలు తప్పాయి. కుడిచేతి బౌలర్ అశ్విన్ కూడా మెరుగ్గా రాణించాడు. ఇక మన పేసర్లు నిప్పులు చెరిగారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినా ఓపికగా ఆడితే పరుగులు వస్తాయని భారత బ్యాట్స్ మెన్ నిరూపించారు. ఈ పని ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ చేయలేకపోయారు.

-వణికించిన భారత బౌలర్లు.. జడేజా, అశ్విన్ ఇద్దరికీ కుదిరిన లయ, సమన్వయం

మన పేస్ బౌలర్లు షమీ, సిరాజ్ ధాటికి తొలి ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఓపెనర్లు అవుట్ అయ్యి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత మన స్పిన్నర్లు రంగంలోకి దిగారు. అక్షర పటేల్ కుదురుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయాడు. మరోవైపు అశ్విన్ ఆస్ట్రేలియన్లను తెగ ఇబ్బందిపెట్టాడు. లంచ్ వరకూ లంబుషేన్, స్టీవ్ స్మిత్ వికెట్ల పతనాన్ని ఆపి ఓ 100 పరుగులు దాటించారు. లంచ్ తర్వాత అసలు కథ మొదలైంది. మన ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్రజడేజా మాయాజాలం మొదలైంది. వరుస బంతుల్లో లబుషాన్, రెన్షా లను జడేజా ఔట్ చేయడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఇదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత మరో 3 కీలక వికెట్లు తీసి ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. ఇక అశ్విన్ చివరి వరుస బ్యాట్స్ మెన్ పనిపట్టడంతో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

-తేలిపోయిన ఆస్ట్రేలియా పేసర్లు, స్పిన్నర్లు.. రెచ్చిపోయిన రోహిత్
ఇక ఇదే నాగపూర్ పిచ్ పై మధ్యాహ్నానికి చాపచుట్టేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తడబడ్డ చోటే మన బ్యాట్స్ మెన్ అదరగొట్టారు. తొలి ఓవర్ లోనే ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ బౌలింగ్ లో మూడు ఫోర్లు కొట్టి మన టీమిండియా స్కోరుకు ఊపు తెచ్చాడు కెప్టెన్ రోహిత్. మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ డిఫెన్స్ మోడ్ లో ఆడడంతో రోహిత్ బ్యాట్ కు పనిచెప్పాడు. 69 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. వన్డేలా ఆడేశాడు. ఇక ఆస్ట్రేలియా పేసర్లు, స్పిన్నర్లు ఏమాత్రం భారత బ్యాట్స్ మెన్ ను ప్రభావితం చేయలేకపోయారు. మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయగా.. దాన్ని కంటిన్యూ చేయడంలో ఆస్ట్రేలియా స్పిన్నర్లు తేలిపోయారు. లయాన్, మర్ఫీ ఆకట్టుకోలేదు. బహుషా కుడిచేతి వాటం వల్ల కావచ్చు వారు ప్రభావం చూపలేకపోయారు.

-చివర్లో వికెట్ డౌన్.. నైట్ వాచ్ మన్ గా అశ్విన్
కుదరుగా ఓపికగా ఆడితే నాగపూర్ పిచ్ పై పరుగులు వస్తాయని మన టీమిండియా బ్యాట్స్ మెన్ నిరూపించారు. రోహిత్ తోపాటు రాహుల్ చివరివరకూ వికెట్ పడకుండా కాపు కాశారు. పరుగులు చేశారు. అయితే స్పిన్నర్ మర్ఫి బౌలింగ్ లో ఈరోజు చివరి ఓవర్ లో రాహుల్ ఔట్ అయ్యాడు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ నైట్ వాచ్ మెన్ గా ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. అశ్విన్ బౌలర్ గానే కాదు.. బ్యాటర్ గా కూడా మెరుగ్గా ఆడుతుండడంతో అతడి నుంచి టీమిండియా భారీగా ఆశిస్తోంది.

మొత్తంగా చూస్తే నాగపూర్ పిచ్ కొంచె ఎడమచేతి వాటం స్పిన్నర్లు అనుకూలించిన మాట వాస్తవమే అయినప్పటికీ సహనంగా ఆడితే పరుగులు చేయవచ్చు. ఆస్ట్రేలియన్లు స్పిన్ అన్న భయానికే ఔట్ అయ్యారు. అదే పిచ్ పై మనోళ్లు మెరుగ్గా ఆడారని చెప్పొచ్చు. భారత్ భారీ స్కోర్ చేస్తే ఈ తొలిటెస్ట్ లో గెలిచే అవకాశాలు ఉంటాయి.