FIFA Announces Suspension Of AIFF: భారత ఫుట్ బాల్ సమాఖ్యకు ఇది అశని పాతం. వర్థమాన క్రీడాకారులకు ఇబ్బంది కరం. అంతర్జాతీయంగా భారత్ కు అవమానకరం. గత కొంతకాలంగా ఎన్నికలు జరగక, ఎగ్జిక్యూటివ్ కమిటీ లేకుండా నెట్టుకొస్తున్న భారత ఫుట్ బాల్ సమాఖ్యలో బయటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువైందనే ఆరోపణలతో అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం (ఫిఫా) సస్పెన్షన్ విధించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. 85 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న భారత ఫుట్ బాల్ సమాఖ్య ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ” భారత ఫుట్ బాల్ సమాఖ్య తీరు బాగోలేదు. ఎన్నోసార్లు చెప్పి చూసినా పద్ధతి మార్చుకోవడం లేదు. అందు గురించే నిషేధం విధించాలని తీర్మానం చేశామని” ఫిఫా కౌన్సిల్ బ్యూరో వెల్లడించింది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీ ( సీవోఏ)ను కూడా రద్దు చేసింది. పైగా రోజువారి కార్యకలాపాలపై భారత ఫుట్ బాల్ సమాఖ్య పూర్తి నియంత్రణ పొందితేనే సస్పెన్షన్ నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉందని ఫిఫా పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిణామాలపై అత్యవసర విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీనిపై బుధవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.
విడతల వారి చర్చలు జరిగాయి
వాస్తవానికి భారత ఫుట్ బాల్ సమాఖ్య పై నిషేధానికి ముందే ఫిఫా కు చెందిన నలుగురు సభ్యుల బృందం, క్రీడా శాఖ సీనియర్ అధికారుల మధ్య గత శుక్రవారం, సోమవారం చర్చలు జరిగాయి. అయితే ఈ బృందం మధ్య జరిగిన చర్చలు సానుకూల సంకేతాలను ఇచ్చాయి. కానీ హఠాత్తుగా మంగళవారం ఫిఫా తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్ కు గురిచేసింది. ఇది భారత ఫుట్ బాల్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫిఫా తీసుకున్న నిర్ణయం ప్రకారం తదుపరి నోటీసు వచ్చేంతవరకు భారత ఫుట్ బాల్ సమాఖ్య అన్ని సభ్యత్వ హక్కులను కోల్పోతుంది.
Also Read: Jawaharlal Nehru: వారసత్వం పేరిట దాడి… నెహ్రూ ఖ్యాతిని కనుమరుగు చేసే యత్నం
ప్రస్తుతం భారత దేశంలో మణిపూర్, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్థమాన ఫుట్ బాల్ క్రీడాకారులు ఉన్నారు. ఫిఫా తీసుకున్న నిర్ణయం పట్ల వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ ప్రభావం ప్రస్తుతం అండర్ 17 మహిళల వరల్డ్ కప్ పై పడింది. భారత్ లోనే ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు జరగాల్సిన ఈ మెగా టోర్నీ నిర్వహణ ప్రస్తుతానికి సాధ్యం కాదని ఫిఫా తేల్చి చెప్పేసింది. టోర్నీని ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాకుండా సస్పెన్షన్ ఎత్తేసే వరకు భారత ఫుట్ బాల్ క్లబ్బులు, ప్రతినిధులు, ఆటగాళ్లు, రెఫరీలు, అధికారులు ఇకపై అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనేందుకు వీలు లేదని కుండ బద్దలు కోట్టింది. ఈ నిర్ణయం వల్ల వచ్చే నెలలో జరిగే వియత్నాం, సింగపూర్ తో భారత జట్టు ఎగ్జిబిషన్ మ్యాచులు, ఏఎఫ్సీ కప్ ఇంటర్ జోనల్ సెమీఫైనల్స్ లో మోహన్ బగాన్ మ్యాచ్ కూడా రద్దుకాక తప్పదు.
ఈ వివాదం ఎందుకు చెలరేగింది
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు సంబంధించిన ఫుట్ బాల్ కార్యక్రమాలను సమాఖ్యలు స్వతంత్రంగా నిర్వహించుకోవాలని ఫిఫా కోరుకుంటుంది. ఇందులో ప్రభుత్వం, కోర్టులు, తృతీయ పక్షం జోక్యాన్ని అసలు సహించదు. కానీ ఫిఫా నిబంధనల గురించి స్పష్టంగా తెలిసినప్పటికీ భారత ఫుట్ బాల్ సమాఖ్య నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వచ్చింది. 2020 డిసెంబర్లోనే అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. కార్యరూపం దాల్చలేదు. పైగా అప్పటికే మూడు దఫాలుగా ప్రఫుల్ పటేల్ అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన క్రీడా బిల్లు ప్రకారం ఆ పదవిలో కొనసాగేందుకు ఎంత మాత్రం వీల్లేదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీంతో ఈ ఏడాది మే 18న భారత ఫుట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ అతడి కార్యవర్గంపై నిషేధం విధించింది. అయితే సమాఖ్యకు సంబంధించిన కార్యకలాపాలు, ఇతరత్రా వ్యవహారాల పర్యవేక్షణకు జస్టిస్ దవే నేతృత్వంలో త్రిసభ్య కార్యనిర్వాహక కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాలను ఎప్పటినుంచో గమనిస్తున్న ఫిఫా కొంతకాలంగా ఆగ్రహంగా ఉంది. ఇందుకు సంబంధించిన వర్తమానాలను కూడా పంపింది. వీటితోనైనా పరిస్థితులు చక్కబడతాయని అనుకుంది. కానీ అంతకంతకు పరిణామాలు దిగజారుతుండడంతో వేటు వేయక తప్పలేదు. అయితే భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28న జరగాల్సిన భారత ఫుట్ బాల్ సమాఖ్య ఎన్నికలపై సందేహం నెలకొంది. ప్రస్తుతం సమాఖ్య పై నిషేధం పూర్తిస్థాయిలో తొలగాలంటే కొత్త కార్యవర్గం ఏర్పడాలి. సీఓఏ బాధ్యతల నుంచి ప్రఫుల్ పటేల్ తప్పుకోవాలి. పైగా క్రీడాకారులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ జరిగితే తప్ప భారత ఫుట్ బాల్ సమాఖ్య పై ఫిఫా విధించిన నిషేధం తొలగిపోదు.
Also Read:Ambati Rambabu Vs Janasena: అంబటి రాంబాబును తగులుకున్న జనసేన