Sahibzada Farhan: ఇటీవల ఆసియా కప్ లో భాగంగా సూపర్ 4 పోరులో భారత జట్టుపై పాకిస్థాన్ ఆటగాడు ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేశాడు. తోటి ఆటగాళ్లు విఫలమవుతున్నప్పటికీ అతడు మాత్రం నిలబడ్డాడు. పాకిస్తాన్ జట్టు ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే దానికి కారణం ఫర్హాన్ బ్యాటింగ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హాఫ్ సెంచరీ చేయడం మంచి విషయమే అయినప్పటికీ.. భారతదేశం మీద ఉన్న కోపం.. అంతకుముందు లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో టీమిండియా సారథి సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం.. ఇవన్నీ కారణాలను దృష్టిలో పెట్టుకున్న పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ మైదానంలో అతి ప్రవర్తన చేశాడు.
హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్ ఫైరింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. బ్యాట్ ను గన్ మాదిరిగా పెట్టి.. బుల్లెట్లు పేల్చుతున్నట్టు హావభావాలను ప్రదర్శించాడు. ఇది సగటు పాకిస్తాన్ అభిమానులకి ఆనందం కలిగించవచ్చేమో గాని.. భారత అభిమానులకు మాత్రం ఇబ్బంది కలిగించింది. అయితే ఆ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ముఖ్యంగా ఫర్హాన్ అతికి అభిషేక్ శర్మ తన బ్యాటుతో సమాధానం చెప్పాడు. మెరుపు వేగంతో పరుగులు తీసి టీమిండియా కు అద్భుతమైన విజయం అందించాడు. అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే పాకిస్తాన్ బౌలర్ రౌఫ్ అడ్డగోలుగా ప్రవర్తించాడు. అభిషేక్ మీదికి దూసుకుపోయాడు. పిచ్చిపిచ్చిగా వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు భారత ఫైటర్ జెట్ లను కూల్చినట్టు సంకేతాలు ఇచ్చాడు.
బంగ్లాదేశ్ గట్టి బుద్ధి చెప్పింది
మైదానంలో ఓవరాక్షన్ చేసిన ఫర్హాన్ కు బంగ్లాదేశ్ గట్టి బుద్ధి చెప్పింది. జన్మలో కోలుకోకుండా చేసింది. గురువారం జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో ఫర్హాన్ ను నాలుగు పరుగులకే అవుట్ చేసింది. నాలుగు పరుగులు చేసిన ఫర్హాన్ తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో రిషద్ హుస్సేన్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఫర్హాన్ మీద ట్రోల్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా టీమ్ ఇండియా అభిమానులు అతని మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. “భారత జట్టు మీద గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ చేశావు కదా.. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైందో.. అందు గురించే భారత జట్టుతో పెట్టుకోవద్దు.. నాలుగు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు కాబట్టి.. ఇక జన్మలో కోలుకోడు అంటూ” హెచ్చరిస్తున్నారు.