Crazy Fan : అభిమానం వెర్రి తలలు వేస్తేనే అసలు ప్రమాదం. ఎందుకంటే ఆ సమయంలో అభిమానం కాస్త ఉన్మాదంగా మారిపోతుంది. ఆ సందర్భంలో ఏం చేస్తున్నామనేది అర్థం కాదు. కానీ అలాంటి వారివల్ల మిగతా వారికి చాలా నష్టం. ఆ సమయంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఉన్మాదాన్ని నింపుకున్న అభిమానులు పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎలాంటి దారుణాలకు పాల్పడేందుకైనా వెనకాడరు. పైగా ఉన్మాద చర్యలకు.. వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. బుధవారం కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న సంఘటన కూడా అలాంటిదే. అభిమాన ప్లేయర్లను చూడాలని ఆరాటం.. మైదానం గోడలు దూకి అందులోకి ప్రవేశించాలని ఆత్రుత.. వెరసి ఇంతటి దారుణానికి కారణమైంది. ఇంతటి ఘోరానికి నాంది పలికింది. మనదేశంలో చోటుచేసుకున్న క్రీడా విషాదాలలో ఇది రెండవ అతిపెద్దదంటే.. అక్కడ ఎలాంటి దారుణం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
మనదేశంలోని యువత నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ఎవరినైనా అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుంటారు. అందువల్లే మన దేశంలో సెలబ్రిటీలకు ఆ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఇక కొందరైతే తమ కుటుంబాని కంటే, తమ కెరియర్ కంటే, మా చదువుల కంటే క్రికెటర్లకు, యాక్టర్లకు, రాజకీయ నాయకులకు విపరీతమైన ప్రాధాన్యమిస్తారు. ఇలాంటి అభిమానం వారి ప్రాణాల మీదకు తెస్తుంది. ఇటీవల తెలుగు రాష్ట్రంలో ఓ హీరో సినిమా విడుదలైనప్పుడు.. కొందరు అభిమానులు కటౌట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో కరెంటు తీగలకు తగిలి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆ హీరో ఆ కుటుంబానికి ఏదో కంటి తుడుపుగా ఐదు లక్షలు ఇచ్చి చేయి దులుపుకున్నాడు. చివరికి అభిమానులే తలా ఇంత వేసుకొని చనిపోయిన అభిమాని కుటుంబానికి ఆర్దికంగా భరోసా ఇచ్చారు. అంటే ఇక్కడ అభిమానులను జస్ట్ తమకు డబ్బులు ఇచ్చే యంత్రాలుగా మాత్రమే సెలబ్రిటీలు చూస్తున్నారు. కేవలం హీరోలు మాత్రమే కాదు క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు తమ క్రేజ్ పెంచుకుంటూ ఉన్నత స్థానాలకు వెళుతుంటారు. కానీ వారి మీద ఉన్న వెర్రి అభిమానంతో అభిమానులు అన్ని కోల్పోతారు.. కర్ణాటక రాజధానిలో చోటు చేసుకున్న సంఘటన ద్వారా అయినా వెర్రి అభిమానులు మారాలి. తమ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. తమ వికృత చేష్టలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కనుక వ్యాఖ్యానించినట్టు.. యువత తమ కెరియర్ మీద ఫోకస్ పెట్టాలి. చదువు మీద దృష్టి సారించాలి. జీవితంలో ఎలా ఎదగాలి అనే విషయంపై తమ మనసును లగ్నం చేయాలి. అంతేతప్ప వెర్రి అభిమానంతో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు పాల్పడదు. అలా పాల్పడితే తమ జీవితాలే కాకుండా.. తమ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా నాశనం అవుతాయి అని తెలుసుకోవాలి.
