Homeక్రీడలుచెపాక్‌ గడ్డ.. ఈసారి ఎవరికి అడ్డా

చెపాక్‌ గడ్డ.. ఈసారి ఎవరికి అడ్డా

India vs England
14 నెలల తర్వాత భారత్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచి భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ జరగనుంది. అయితే.. చెపాక్‌ భారత క్రికెట్‌కు ఎన్నో జ్ఞాపకాల వేదికగా నిలిచింది. టీమిండియా తొలిసారిగా గెలుపు రుచిచూసింది ఇక్కడే. 1934లో మొదలైన భారత క్రికెట్‌.. 1952లో ఈ మైదానంలోనే తొలి విజయాన్ని నమోదు చేసింది. అంతేగాక దిగ్గజ క్రికెటర్‌‌ సునిల్‌ గవాస్కర్‌‌ 30వ శతకం.. 1986–87లో భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌ ‘టై’ చెన్నైలోనే. ఇక చెపాక్‌ స్టేడియమంటే మన బ్యాట్స్‌మెన్‌కు చెప్పలేని హుషారు వచ్చేస్తుంది. భారత క్రికెట్‌ చరిత్రలో మూడు త్రిశతకాలు నమోదైతే అందులో రెండు ఇక్కడే. 2008లో వీరేంద్ర సేహ్వాగ్‌ వీరవిహారం చేస్తే కరుణ్ నాయర్‌‌ 2016లో సునామీ సృష్టించాడు. ఇక టీమిండియా అత్యధిక స్కోరు 759/7 నమోదైంది కూడా ఇక్కడే.

Also Read: ఇంగ్లండ్ తో టీమిండియా ఢీ.. ఈసారి భారీ మార్పులట?

టీమిండియా తరఫున నమోదైన మూడు త్రిశతకాల్లో రెండు సెహ్వాగే సాధించాడు. 2004లో ముల్తాన్‌ స్టేడియంలో పాకిస్థాన్‌పై తొలి ట్రిపుల్‌ సెంచరీ (309) బాదాడు. ఆ తర్వాత నాలుగేళ్లకే చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మరో త్రిశతకాన్ని అందుకున్నాడు. సెహ్వాగ్‌ ఊచకోతకు 2008 భారత పర్యటన సఫారీలకు పీడకలగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో గ్రేమ్‌స్మిత్‌ సేన 540 పరుగులు చేసింది. ఆమ్లా 159 పరుగులు చేశాడు. దీంతో భారత్‌కు కష్టాలు తప్పవని అనుకున్నారంతా. కానీ.. సెహ్వాగ్‌ ఇన్నింగ్స్‌ను చూసిన తర్వాత కష్టాలు టీమిండియాకు కాదు సఫారీలకు అనేలా పరిస్థితి మారిపోయింది.

స్పిన్నర్‌‌, పేసర్‌‌ తేడా లేకుండా సఫారీ బౌలర్లను వీరూ ఊచకోతనే కోశాడు. 42 ఫోర్లు, 5 సిక్సర్లతో 319 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి తోడుగా ఇండియన్‌ వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో భారత్‌ 627 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో సెహ్వాగ్‌ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఏబీ డివిలియర్స్‌, మార్క్‌ బౌచర్‌‌ను బోల్తా కొట్టించాడు.

Also Read: ఫోటో షేర్ చేసి కూతురి పేరు రివీల్ చేసిన ‘విరుష్క’

ఈ ఇన్నింగ్స్‌ సాధించిన ఎనిమిదేళ్ల తర్వాత యువ ఆటగాడు కరుణ్‌ నాయర్‌‌ చెన్నైలోనే త్రిశతకం బాదేశాడు. 2016లో భారత్‌ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌పై అతడు విజృంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇగ్లండ్‌ 477 స్కోర్‌‌ చేసింది. మొయిన్‌ అలీ 146 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 759/7 రికార్డు స్కోరు నమోదు చేసింది. అయితే.. స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్‌ నాయర్‌‌ (303*) పరుగుల వరద పారిస్తూ ట్రిపుల్‌ సెంచరీ అందుకున్నాడు. అతడితో పాటు కేఎల్‌ రాహుల్‌ (199) చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 207 పరుగులకే ఆల్‌ అవుట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఎన్నో నెలల విరామం అనంతరం ఆడుతున్న ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. అంతేగాక ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులు చెపాక్‌ స్టేడియంలోనే జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో త్రిశతక రికార్డును భారత బ్యాట్స్‌మెన్‌ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular