Eng Vs Aus Ashes 2025: బూడిద పోరాటంలో ఇప్పటికే ఆస్ట్రేలియా విజయం సాధించింది. బూడిద ట్రోఫీని ఇంగ్లాండ్ జట్టుకు వెళ్లకుండా సగర్వంగా ఒడిసి పట్టింది. ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే మూడు టెస్టులు ఓడిపోయిన నేపథ్యంలో.. మెల్బోర్న్ వేదికగా శుక్రవారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో సత్తా చూపిస్తుందని అందరూ అనుకున్నారు. దీనికి తోడు మద్యం వ్యవహారం తెరపైకి రావడంతో.. ఇంగ్లాండ్ జట్టు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది.
బాక్సింగ్ డే టెస్టులో భాగంగా బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు.. అదిరిపోయే స్థాయిలో బంతులు వేసింది. మెల్బోర్న్ మైదానం మీద సంచలనమైన బౌలింగ్ వేసింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు 152 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇటీవల సిరీస్లలో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఇలా ఒత్తిడి ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ ఐదు వికెట్ సొంతం చేసుకున్నాడు. అట్కిన్సన్ రెండు వికెట్లు సాధించాడు. ఈ మైదానం మీద ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా మెలితిప్పారు. ఈ సిరీస్ లో తొలిసారిగా ఆతిధ్య జట్టు మీద ఆధిపత్యాన్ని సాధించారు.
ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా జట్టు కంటే దారుణంగా బ్యాటింగ్ చేసింది.. ఇంగ్లాండ్ జట్టులో బ్రూక్ 41 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టు టాప్ ఆర్డర్ మొత్తం విఫలం కావడంతో 110 పరుగులకే ఆల్ అవుట్ అయింది. తద్వారా ఒకేరోజు మెల్బోర్న్ మైదానం లో 20 వికెట్లు నేలకూలాయి. ఇరుజట్లలో కూడా పేస్ బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి వికెట్లు దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో పెర్త్ టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. ఆ తదుపరి టెస్టులు దాదాపు ఐదు రోజులపాటు సాగాయి. ఇప్పుడేమో మెల్బోర్న్ టెస్ట్ లో తొలిరోజే 20 వికెట్లు నేలకూలాయి. ఈ ప్రకారం చూసుకుంటే మెల్బోర్న్ టెస్ట్ కూడా పెర్త్ మాదిరిగానే మూడు రోజుల్లోనే ముగుస్తుందని క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
ఇక ఈ టెస్టులో ఇప్పటివరకు ఆస్ట్రేలియా 40+ పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన హెడ్ రెండవ ఇన్నింగ్స్ లో సత్తా చూపిస్తాడని ఆస్ట్రేలియా జట్టు నమ్ముతోంది. అయితే రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు నైట్ వాచ్మెన్ గా బోలాండ్ ను బ్యాటింగ్లోకి దింపింది. అతడు ఇప్పటికే ఒక ఫోర్ కొట్టి.. సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో అతడు మూడు వికెట్లు పడగొట్టాడు. ఇతడు కూడా సంచలమైన ఇన్నింగ్స్ ఆడతాడని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. మరోవైపు పెర్త్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులు చేసిన ఆస్ట్రేలియా జట్టు.. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం దుమ్మురేపింది. మెల్బోర్న్ టెస్టులో కూడా అదే స్థాయిలో ఆడుతుందని ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు. బాక్సింగ్ డే టెస్ట్ లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
All in a day’s play at the MCG! #Ashes pic.twitter.com/PxJI5ti5Yd
— cricket.com.au (@cricketcomau) December 26, 2025