England Vs Australia Ashes 4th Test: యాషెస్ సిరీస్ లో పోటీలో నిలవాలంటే తప్పక గలవాల్సిన నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ సులభంగా విజయం సాధించాల్సిన ఉన్నప్పటికీ వరుడు ఆటంకం కలిగించడంతో డ్రాగా ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు విజయాశలపై వరుణుడు నీళ్లు చల్లినట్టు అయింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఐదో టెస్టులో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుకు ఏర్పడింది. ఐదో టెస్టులో విజయం సాధిస్తేనే సిరీస్ సమం చేసే అవకాశం ఇంగ్లాండ్ జట్టుకు లభిస్తుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే యాషెస్ సిరీస్ ఈసారి కూడా అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ ఏడాది నిర్వహిస్తున్న యాషెస్ కు ఇంగ్లాండ్ ఆతిధ్యం ఇస్తోంది. గత నెల 16 నుంచి ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 386 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 273 పరుగులకు ఆల్ అవుట్ కాగా, ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్లు నష్టానికి 282 పరుగులు చేసి విజయం సాధించింది. అదే విధంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా జట్టు 43 పరుగులు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ జట్టు 325 పరుగులకు పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 279 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ జట్టు 327 పరుగులకు పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 43 పరుగులు తేడాతో రెండో టెస్టులోనూ విజయం సాధించింది. వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించడంతో ఈసారి యాషెస్ సిరీస్ ను ఆసీస్ కైవసం చేసుకుంటుందని అంతా భావించారు. అయితే, లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ జట్టు 237 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 224 పరుగులకు ఆల్ అవుట్ కాగా, ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు పూర్తి చేసి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలిసారి ఇంగ్లాండ్ జట్టు సిరీస్ లో విజయాన్ని నమోదు చేసింది.
వరుణుడు ఆటంకం.. ఇంగ్లాండ్ చేజారిన సిరీస్..
ఓల్డ్ ట్రఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టును విజయం ఊరించి ఉసూరుమనిపించింది. మొదటి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 592 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్ లో భారీ పరుగులను సాధించగలిగింది. భారీ పరుగుల లక్ష్యంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 317 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఆడించింది. మూడో రోజు సుమారు 40 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులు చేసి నాలుగు వికెట్లను నష్టపోయింది. రెండు రోజులు ఆట మిగిలి ఉండగా.. ఆరు వికెట్లు తీస్తే ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తుంది. ఈ దశలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించడం సులభమే అని అంతా భావించారు. అందుకు అనుగుణంగానే ఇంగ్లాండ్ బౌలర్లు కూడా రాణిస్తుండడంతో సిరీస్ ను 2-2 తో సమం చేస్తామని ఇంగ్లాండ్ జట్టు భావించింది. కానీ అనూహ్యంగా ఇంగ్లాండ్ విజయానికి వరుణుడు అడ్డు తగలడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఐదో టెస్టులో విజయమే లక్ష్యంగా ఇంగ్లాండ్..
ఈ నెల 27 నుంచి ఓవల్ వేదికగా ఐదో టెస్టు జరగనుంది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో ఐదో టెస్టులో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుకు ఏర్పడింది. ఈ టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తేనే సిరీస్ ను సమం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించకపోతే మాత్రం సిరీస్ ఆస్ట్రేలియా గెలుచుకుంటుంది. ఆస్ట్రేలియా జట్టు మాత్రం చివర టెస్ట్ ను డ్రా గా ముగించుకున్న సిరీస్ కైవసం చేసుకోగలుగుతుంది. దీంతో ఐదో టెస్టులో విజయం లక్ష్యంగా ఇంగ్లాండ్ బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.