ED Shock Celebrities: వాళ్లంతా సెలబ్రిటీలు.. కొందరేమో పేరుపొందిన క్రికెటర్లు.. ఇంకొందరేమో సినిమా తారలు. వారి సంపాదన కోట్లల్లో ఉంటుంది. మ్యాచ్ల ద్వారా, సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తుంటారు.. ప్రకటనల ద్వారా కూడా అంతకుమించి ఆర్జిస్తుంటారు..
పేరుకు పేరు, డబ్బుకు డబ్బు ఉంటుంది కాబట్టి.. వారికి ఎటువంటి లోటు ఉండదు.. అడుగు తీస్తే డబ్బు.. అడుగు వేస్తే డబ్బు.. విలాసవంతమైన జీవితం.. ఇవన్నీ వారి సొంతం.. ఇటువంటి వారికి డబ్బుకు లోటు ఉండదు. పేరు ప్రఖ్యాతలకు లోటు ఉండదు. అటువంటి ఈ సెలబ్రిటీలు డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. తమకు ఎంతో ఇచ్చిన సమాజానికి మంచి చేయాల్సింది పోయి.. చెడు చేశారు.. చివరికి చట్టం ముందు దోషులుగా నిలబడ్డారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్ ల పై ఉక్కు పాదం మోపింది. అనేక బెట్టింగ్ యాప్స్ ను నిషేధించింది. అయితే బెట్టింగ్ యాప్లకు చాలామంది సెలబ్రిటీలు ప్రమోషన్ చేశారు. భారీగా దండుకున్నారు. అయితే ఇందులో హవాలా, ఇతర వ్యవహారాలు ఉన్నాయని కేంద్ర దర్యాప్తు బృందం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఇందులో బాగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించింది. వారు చెప్పిన వివరాలతో సంతృప్తి చెందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పుడు ఒక అడుగు ముందుకేసింది.
బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వారిలో క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, సినీ నటులు సోనుసూద్, నేహా శర్మ, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా వంటి వారు ఉన్నారు. వీరిని ఇప్పటికే పలు దఫాలుగా విచారించిన కేంద్ర దర్యాప్తు బృందం.. ఇప్పుడు ఏకంగా కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆస్తులను అటాచ్ చేసింది. తెలుగులో కూడా రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్.. లాంటి నటులు చాలామంది ఉన్నారు. వారు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీరి విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.