Yashasvi Jaiswal: విశాఖపట్నంలో డబుల్ సెంచరీ సాధించి ఇంగ్లాండ్ జట్టుకు శాంపిల్ చూపించిన భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్..రాజ్ కోట్ లో మాత్రం 70 ఎం ఎం లో సినిమా చూపించాడు. 236 బంతుల్లో 214 పరుగులు చేసి వరుసగా రెండవ డబుల్ సెంచరీ సాధించాడు. 14 ఫోర్లు, 12 సిక్స్ ల సహాయంతో అతడు ఈ ఘనత సాధించాడు. సర్ప రాజ్ ఖాన్ తో కలిసి ఐదో వికెట్ కు 172 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 150 పరుగులు చేసే వరకు సమయోచితంగా ఆడిన జైస్వాల్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం వల్ల ఆగిపోయాడు గాని.. లేకుంటే త్రిబుల్ సెంచరీ సాధించేవాడే. అయితే ఈ డబుల్ సెంచరీ ద్వారా ఏకంగా కెప్టెన్ రికార్డుకే ఈసారి పెట్టాడు యశస్వి జైస్వాల్.
రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు యశస్వి జైస్వాల్ రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు (12) కొట్టిన భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. కుడి చేతివాటం పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో జైస్వాల్ హ్యాట్రిక్ సిక్స్ లు బాదాడు. గతంలో మయాంక్ అగర్వాల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంయుక్తంగా ఎనిమిది సిక్సర్ల రికార్డులను కలిగి ఉన్నారు. వారి రికార్డులను యశస్వి జైస్వాల్ బ్రేక్ చేశాడు.. 1996లో జింబాబ్వేపై పాకిస్తాన్ ఆటగాడు వసీం అక్రమ్ ఒకే టెస్ట్ ఇన్నింగ్స్ లో 12 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్ లో వసీం అక్రమ్ 363 బంతుల్లో 257 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. 22 ఫోర్లు, 12 సిక్స్ ల సహాయంతో అతడు ఈ ఘనత సాధించాడు.. ఆటగాడు సక్లైన్ మస్తాక్ తో కలిసి 8 వికెట్ కు 313 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జైస్వాల్ కూడా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో 12 సిక్సులు బాదాడు.
2019లో విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ 13 సిక్స్ లు కొట్టాడు. ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. అతని తర్వాతి స్థానంలో పాకిస్తాన్ బౌలర్ వసీం అక్రమ్ ఉన్నాడు. ఇప్పుడు జైస్వాల్ కూడా అతడి సరసన చేరాడు.. కాగా, రాజ్ కోట్ లో నూ డబుల్ సెంచరీ సాధించిన జై స్వాల్ ను దిగ్గజ క్రికెట్ క్రీడాకారులు అభినందిస్తున్నారు. కాగా, 4 వికెట్ల నష్టానికి భారత్ 434 పరుగులు చేసిన సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఇంగ్లాండ్ ఎదుట కొండంత లక్ష్యాన్ని ఉంచారు. రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు వికెట్ లేమీ నష్టపోకుండా15 పరుగులు చేసింది. భారత్ పై విజయం సాధించాలంటే ఇంగ్లాండ్ ఇంకా 542 పరుగులు చేయాల్సి ఉంది.ఇంకా రోజున్నర ఆట మిగిలి ఉంది. ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్లు ఉన్నాయి.