India Vs West Indies Test Series: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. క్రికెట్ అభిమానులందరికీ ఇది తెలిసిన పదమే. అయితే ప్రతీ క్రీడలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉంటుంది. కానీ క్రికెట్‌లోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఇప్పుడు దీని గురించి ఎందుకంటే ఖరీదైన క్రికెట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కిందంటే భారీగానే డబ్బులు వ్యక్తిగత ఖాతాలో జమవుతాయి. కానీ వెస్టిండీస్ బోర్డు ఆర్థిక నష్టాల పేరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఇచ్చే ప్రైజ్ మనీని తగ్గించింది. మరోవైపు షెడ్యూల్ బిజీగా ఉన్నా వెస్టిండీస్ గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడేందుకు అక్కడి క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా చేయూత అందించడానికే అని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆటగాళ్లు కూడా నోరుమెదపడం లేదని.. కానీ టీమిండియా అభిమానులు మాత్రం మీమ్స్ రూపంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుపై సెటైర్లు వేస్తున్నారు.
పెరుగుతున్న ఆదరణతో..
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రెండు నెలలకొకసారి క్రికెట్ మ్యాచ్‌లు ఉండేవి. కానీ ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. టీ20 లీగ్‌ల కారణంగా మ్యాచ్‌ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఇచ్చే ప్రైజ్ మనీ కూడా భారీగానే ఉంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఆటగాడికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నారు. అయితే వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఇచ్చే ప్రైజ్ మనీ ఆశ్చర్యం కలిగించింది.
500 డాలర్లు మాత్రమే..
వెస్టిండీస్‌తో తొలి టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకోవడంతో వెస్టిండీస్‌పై టీమిండియా 141 ఇన్నింగ్స్ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో అదరగొట్టిన టీమిండియా యువ ఆటగాడు యషస్వీ జైశ్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ అవార్డు కింద వెస్టిండీస్ బోర్డు కేవలం 500 డాలర్లు మాత్రమే ఇచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.41 వేలు అన్నమాట. టీ20 లీగ్‌లలోనే మినిమం రూ.లక్ష ఇస్తున్న ఈ రోజుల్లో అంతర్జాతీయ మ్యాచ్ కింద కేవలం రూ.41 వేలు మాత్రమే ఇవ్వడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి..
అయితే వెస్టిండీస్ బోర్డు ఆర్థిక నష్టాల్లో ఉండటంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద ఇచ్చే ప్రైజ్ మనీ 500 డాలర్లు మాత్రమే ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1–0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు ఈనెల 20 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనుంది. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన విండీస్ రెండో టెస్టులో అయినా పుంజుకుంటుందేమో వేచి చూడాలి.