Mohammed Shami career: అతడు బంతులు వేస్తే బుల్లెట్ల మాదిరిగా ఉంటాయి. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాయి. చూస్తుండగానే నష్టం చేకూర్చుతాయి. అటువంటి బౌలర్ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. జట్టులో చోటు లభించక అవస్థలు పడుతున్నాడు. 2023 వరల్డ్ కప్ లో గాయపడి.. లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకున్న అతడు.. ఇప్పటివరకు జాతీయ జట్టులోకి ప్రవేశించలేదు. మేనేజ్మెంట్ కూడా అతడిని పట్టించుకోవడం లేదు. దీంతో అతడి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు అతడికి అవకాశం లభిస్తుందా? మేనేజ్మెంట్ కరుణిస్తుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
టీమిండియాలో బుమ్రా స్థాయిలో సత్తా చూపించిన మహమ్మద్ షమీ ప్రస్తుతం జట్టులో చోటు లభించక ఇబ్బంది పడుతున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో అతడు అద్భుతమైన ప్రతిభ చూపించాడు. బుమ్రా స్థాయిలో వికెట్లు తీసిన అతడు… పాదం గాయం వల్ల లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.. సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రికి పరిమితమయ్యాడు. ఈ సమయంలో టి20 వరల్డ్ కప్ జరిగింది.. ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. టీమిండియా కొన్ని టి20 సిరీస్ లు కూడా ఆడింది. పాదం గాయం తగ్గిన తర్వాత అతడు మైదానంలోకి అడుగుపెట్టాడు. డొమెస్టిక్ క్రికెట్లో పర్వాలేదనిపించాడు. దీంతో అతనికి అవకాశాలు వస్తాయని.. జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుతం షమీ ఆస్ట్రేలియా సిరీస్ కు కూడా ఎంపిక కాలేదు. ఐపీఎల్ లో అతడు సత్తా చూపించలేకపోవడంతో సెలెక్టర్లు అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అందువల్లే అతడిని ఎంపిక చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అతని వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా లేదు. భార్య వేధింపుల కేసు పెట్టడంతో విడాకులు ఇవ్వక తప్పలేదు. అటు వ్యక్తిగత జీవితం.. ఇటు క్రీడా జీవితం ఆటుపోట్లకు గురవుతున్న నేపథ్యంలో షమీ కెరియర్ డోలాయమానంలో ఉంది.
గడచిన ఆరు నెలలుగా అతడు ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడక పోవడంతో కెరియర్ ప్రమాదంలో పడిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వ్యక్తిగత సమస్యలు కూడా అతడు తిరిగి సత్తా చాటడానికి అడ్డుపడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. షమీ 64 టెస్టులు, 108 వన్డేలు, 25 t20 మ్యాచ్ లు ఆడాడు.