India Vs South Africa Final: డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఐదు కోట్లు.. ఇదంతా విరాట్, అక్షర్ చలవే..

దశాబ్దం తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ వెళ్ళింది. వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లో తలపడింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 30, 2024 8:38 am

India Vs South Africa Final

Follow us on

India Vs South Africa Final: క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ దేశంలో అయినా.. ఆ క్రీడను ఎక్కువగా ఆరాధించేది భారతీయులే. క్రికెట్ కూడా ఒక మతమైతే.. అది ఇంగ్లాండ్ జనాభాను మించిపోతుంది. 100 కోట్లకు పైచిలుకు జనాభా ఉన్న భారతదేశంలో మెజారిటీ ప్రజలు క్రికెట్ చూస్తారు. క్రికెట్ ఆడే ఆటగాళ్లను ఆరాధిస్తారు. క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉంది కాబట్టే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ప్రపంచంలోనే అత్యధిక క్యాష్ రిచ్ లీగ్ గా పేరుపొందింది. టీమిండియా ఆడే మామూలు మ్యాచ్ లనే ప్రేక్షకులు విరగబడి చూస్తారు. అలాంటిది t20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరితే ఊరుకుంటారా.. ఇంకేముంది రెచ్చిపోయి చూశారు. ఆడుతోంది వెస్టిండీస్ లో కాబట్టి.. సెల్ ఫోన్లకు అతుక్కుపోయారు. అదే ఇండియాలో అయితేనా.. మైదానం కిటకిటలాడేది.

దశాబ్దం తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ వెళ్ళింది. వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లో తలపడింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. దక్షిణాఫ్రికా బౌలర్లు పదునైన బంతులు వేయడంతో టీమిండియా 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. సూపర్ -8, సెమీస్ మ్యాచ్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. ఫైనల్ మ్యాచ్లో 9 పరుగులకే అవుట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ మూడు పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. రిషబ్ పంత్ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో టెన్షన్ పెరిగిపోయింది. ఈ దశలో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ ఇండియా ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. నాలుగో వికెట్ కు 72 పరుగులు జోడించారు. 47 పరుగులు చేసిన అక్షర్ పటేల్ రన్ అవుట్ అయ్యాడు. ఇదే దశలో విరాట్ కోహ్లీ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు.. అక్షర్ ఔట్ అయిన తర్వాత మైదానంలోకి వచ్చిన శివమ్ దూబే తో కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని విరాట్ నెలకొల్పాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

ఇక ఈ ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయింది. అయితే ఈ మ్యాచ్లను ఉచితంగా చూసే అవకాశాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కల్పించింది. 10 సంవత్సరాల తర్వాత టీమిండియా ఫైనల్ వెళ్లడం .. టి20 వరల్డ్ కప్ సాధించి 17 సంవత్సరాలు కావడం తో.. దక్షిణాఫ్రికా జరిగిన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు సెల్ ఫోన్లకు అతుక్కుపోయారు. మ్యాచ్ ప్రారంభమైనప్పుడు లైవ్ చూసే వారి సంఖ్య రెండు కోట్లుగా ఉండగా.. ప్రారంభ ఓవర్లలో టీమిండియా మూడు వికెట్లు కోల్పోవడంతో ఆ సంఖ్య 1.5 కోట్లకు పడిపోయింది. ఎప్పుడైతే విరాట్ – అక్షర్ దూకుడుగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారో.. అప్పుడే లైవ్ చూసే వారి సంఖ్య పెరిగింది. ఒకానొక దశలో వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్ చూసే ప్రేక్షకుల సంఖ్య ఐదు కోట్లకు చేరుకుంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ సీజన్ లో ఈ స్థాయిలో వ్యూయర్ షిప్ నమోదు కాలేదు. చివరికి భారత్ పాకిస్తాన్ తలపడినప్పుడు.. లైవ్ చూసే వారి సంఖ్య నాలుగు కోట్లకు మించలేదు. కానీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం సరికొత్త రికార్డు నమోదయింది. భారత్ ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్ ఔట్ అయిన తర్వాత మళ్లీ వ్యూయర్ షిప్ డౌన్ అయింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో.. క్లాసెన్ ఆడుతున్నంతసేపు వ్యూయర్ షిప్ డౌన్ కాగా.. అతడు అవుట్ అయిన వెంటనే మళ్ళీ పెరిగింది. చివరికి 5 కోట్ల వద్ద స్థిరంగా ఉంది.. చివరికి భారత్ మ్యాచ్ గెలవడంతో.. ప్రేక్షకులు సంబరాలు చేసుకున్నారు.. టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఉచితంగా చూసే అవకాశం కల్పించిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.