https://oktelugu.com/

Dinesh Karthik : గత సీజన్ ఐపీఎల్ లో హీరో.. ఈ సీజన్ లో జీరోగా మారిన ఆ క్రికెటర్..!

ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు దినేష్ కార్తీక్. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే దారుణంగా విఫలమయ్యాడు.

Written By:
  • NARESH
  • , Updated On : April 27, 2023 / 11:31 PM IST
    Follow us on

    RCB dinesh karthik: క్రికెట్ లో ఎప్పుడు ఎవరు హీరో అవుతారో..? ఎవరు జీరో అవుతారో..? చెప్పలేని పరిస్థితి. ఒకే ఒక్క ప్రదర్శనతో రాత్రికి రాత్రి హీరోగా మారిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఎన్ని అవకాశాలు వచ్చినా సత్తా చాటుకోలేక జీరో గా మారిన ప్రతిభ కలిగిన ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటువంటి ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. అటువంటి కోవకే వస్తాడు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. గతేడాది అద్భుత ఇన్నింగ్స్ లు ఆడి బెంగళూరు జట్టుకు హీరోగా మారిన దినేష్ కార్తీక్.. ఈ ఏడాది ఘోర వైఫల్యంతో జట్టుకు భారంగా మారి జీరో అయ్యాడు.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రయాణం సాఫీగా సాగడం లేదు. పడుతూ లేస్తూ సీజన్ ను ముందుకు సాగిస్తోంది. ఒక మ్యాచ్ లో గెలిస్తే.. మరో మ్యాచ్ లో ఓడిపోవడం ఈ జట్టుకు పరిపాటిగా మారింది. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 21 పరుగులు తేడాతో బెంగళూరు జట్టు ఓటమిపాలైంది.

    ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రయాణం ఎప్పుడు కాస్త భిన్నంగానే ఉంటుంది. టైటిల్ హాట్ ఫేవరెట్ గా ప్రతి సీజన్ ను ఈ జట్టు ప్రారంభిస్తోంది. అందుకు తగ్గినట్టుగానే కొన్ని మ్యాచ్ ల్లో ప్రదర్శన కనబరుస్తూ వెళుతుంటుంది. అద్భుతమైన ప్రదర్శనతో ఆనందాన్ని వ్యక్తం చేసే అభిమానులను ఉసురుమనిపించేలా.. మరో ప్రదర్శన చేయడం ఈ జట్టుకు అలవాటుగా మారిపోయింది. తాజా సీజన్ లో కూడా బెంగళూరు జట్టు పడుతూ లేస్తూ ప్రయాణం సాగించడం అభిమానులను కలవడానికి గురి చేస్తోంది. ఈ సీజన్ లో అయినా కప్ గెలవాలని ఆకాంక్షిస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.

    నాలుగు విజయాలు.. నాలుగు ఓటములు..

    ఐపీఎల్ 16వ ఎడిషన్ లో సగం మ్యాచ్ లు పూర్తయ్యేసరికి బెంగళూరు జట్టు నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించగా, మరో నాలుగు మ్యాచ్ ల్లో ఓటమి చవి చూసింది. గెలిచిన నాలుగు మ్యాచ్ ల్లో కూడా కేజిఎఫ్ విజృంభించడంతోనే సాధ్యమయ్యాయి. కేజిఎఫ్ అంటే.. కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్, ఫాఫ్ డు ప్లెసిస్. వీరి వల్లే నాలుగు మ్యాచ్ ల్లో బెంగళూరు జట్టు విజయం సాధించగలిగింది. ఈ ముగ్గురి మీదే ఆ జట్టు అతిగా ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ ముగ్గురు విఫలమైతే జట్టు మొత్తం చేతులెత్తేస్తోంది.

    నమ్మకాన్ని వమ్ము చేస్తున్న ఆ కీలక ఆటగాడు..

    గత ఏడాది ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు దినేష్ కార్తీక్. ఈ సీజన్ లో కూడా అదరగొడతాడని జట్టు యాజమాన్యం బలంగా నమ్మకం పెట్టుకుంది. అయితే దినేష్ కార్తీక్ ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా ప్రదర్శన చేస్తున్నాడు. గత ఏడాది అద్భుత ప్రదర్శనతో జట్టుకు హీరోగా మారిన దినేష్ కార్తీక్.. ఈ ఏడాది పూర్తిగా ఫెయిల్ అయి జట్టుకు విలన్ గా మారాడు. మంచి ఫినిషర్ గా జట్టుకు ఉపయోగపడతాడని భావించిన కార్తీక్ దారుణంగా ఫెయిల్ కావడంతో బెంగళూరు జట్టు ఓటమి చవి చూడాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు ఈ వెటరన్ బ్యాటర్. దీంతో జట్టుకి భారంగా తయారయ్యాడని యాజమాన్యంతో పాటు అభిమానులు భావిస్తున్నారు.

    చెప్పుకోదగిన ఇన్నింగ్స్ లేదు..

    ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు దినేష్ కార్తీక్. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే దారుణంగా విఫలమయ్యాడు. 18 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో రింకు సింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫినిషర్ పాత్రకు న్యాయం చేయని దినేష్ కార్తీక్ రికార్డులకు మాత్రం కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఇంకా గతేడాది ఐపీఎల్ లో 16 మ్యాచుల్లో 55 సగటుతో 183 స్ట్రైక్ రేటు తో 330 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో దినేష్ కార్తీక్ టీమిండియాకు తిరిగి వచ్చాడు. అతను ఆస్ట్రేలియాలో ఆడిన టి20 ప్రపంచ కప్ లో కూడా భాగమయ్యాడు. అయితే అతను బ్యాట్ ఆ మెగా టోర్నీలో సైలెంట్ అయిపోయింది. పరుగులు చేయడంలో విఫలమైన కార్తీక్ మళ్ళీ టీమిండియా నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.

    ఐపీఎల్ లోను కొనసాగుతున్న ఫెయిల్యూర్..

    టి20 వరల్డ్ కప్ నుంచి సరిగా ఆడలేకపోతున్న కార్తీక్ తాజా ఐపీఎల్ లోను అదే ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్లో 11 సగటుతో 83 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 28 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. దీంతో ఆర్సీబీ జట్టుకు ప్రస్తుతం దినేష్ కార్తీక్ భారంగా మారాడు. జట్టుకు మంచి ఫినిషర్ గా ఉంటాడని భావించిన దినేష్ కార్తీక్ వైఫల్యం పట్ల అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫినిషర్ గా కంటే కామెంటేటర్ గా పనికి వస్తావని, యువ క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చి వెళ్లిపోవాలని సామాజిక మాధ్యమాలు వేదిక డిమాండ్ చేస్తున్నారు.