USA Cricket : అమెరికా బేస్ బాల్ లో.. క్రికెట్ స్థానం సంపాదించినట్టేనా?

ఇన్ని పరిణామాల నేపథ్యంలో అమెరికాలో ఐసీసీ క్రికెట్ ను వ్యాప్తి చేయడంలో సఫలీకృతమైంది. పైగా అమెరికా జట్టు కూడా సూపర్ -8 కు వెళ్లేందుకు అడుగులు వేస్తోంది.

Written By: NARESH, Updated On : June 13, 2024 11:13 pm

Did cricket take the place of USA baseball?

Follow us on

USA Cricket : మనదేశంలో క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది.. ఈ ఆటను ఒక మతంగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు. బ్రిటిష్ పరిపాలకులు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పి.. వారు ఏలిన కామన్వెల్త్ దేశాలలో క్రికెట్ ఆటకు మంచి ఆదరణ ఉంది… అందుకే ఈ దేశాలలో ఎటువంటి క్రికెట్ టోర్నీ జరిగినా అభిమానుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది..

ఈసారి ఐసీసీ అన్నిటికంటే భిన్నంగా అమెరికా దేశంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. వెస్టిండీస్ జట్టు కూడా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. వాస్తవానికి క్రికెట్ తో ఏమాత్రం సంబంధం లేని అమెరికాలో ఈ టోర్నీ నిర్వహిస్తుండడం ఒకరకంగా సాహసమే. అమెరికాలో బేస్ బాల్, బాస్కెట్ బాల్ విపరీతంగా ఆడతారు. అలాంటి ఈ దేశంలో క్రికెట్ కు కూడా ఆదరణ దక్కుతోందంటే అతిశయోక్తి కాదు.

జూన్ రెండు నుంచి అమెరికా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఈ దేశంలో క్రికెట్ విస్తరించేందుకు ఐసీసీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 2028లో ఒలంపిక్స్ జరగనున్నాయి. 128 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒలంపిక్స్ నిర్వహిస్తున్నారు. అందులో క్రికెట్ క్రీడను తిరిగి ప్రవేశపెట్టించేందుకు ఐసీసీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందువల్లే అమెరికా వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది..

అమెరికాలో బేస్ బాల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నేషనల్ ఫుట్ బాల్ లీగ్ (ఎన్ ఎఫ్ ఎల్), నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ( ఎన్ బీఏ) వంటి టోర్నీలు ఉంటే ప్రపంచాన్ని అమెరికా పూర్తిగా మర్చిపోతుంది.. గుండ్రటి బ్యాట్ తో బేస్ బాల్ ను చూసే అమెరికన్లు, ఫ్లాట్ బ్యాట్ తో ఆడే క్రికెట్ ను అదే ఉత్కంఠతో చూస్తారా? ఈ గేమ్ లో ” పీచర్” , ” సెకండ్ బేస్”, “షార్ట్ స్టాప్” వంటి ఫీల్డ్ పొజిషన్లను అమెరికన్లు ఏళ్ల తరబడి చూస్తున్నారు.. అలాంటి వారికి క్రికెట్లో “డీప్ మిడ్ వికెట్”, ” స్లిప్” , “గల్లీ”, “ఫైన్ లెగ్” అంటే అర్థమవుతుందా? అనే సందేహాలు టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి చాలామందిలో వ్యక్తం అయ్యాయి.

అయితే తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో క్రికెట్ చూసే వారి సంఖ్య ఐదు కోట్లకు మించిపోయిందని తెలుస్తోంది. గతంలో ఈ సంఖ్య మూడు కోట్లకు ఉండేది. టి20 వరల్డ్ కప్ కంటే ముందే గత ఏడాది మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ విజయవంతమైంది. దీంతో ఐసీసీ అమెరికాలో టి20 వరల్డ్ కప్ ఉత్సాహంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. టోర్నీ కంటే ముందు టి20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ గా జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ ను నియమించింది. యుద్ధ ప్రాతిపదికన స్టేడియాలను ఏర్పాటు చేసింది. యువరాజ్ సింగ్, కపిల్ దేవ్, గేల్ వంటి వెటరన్ ఆటగాళ్లతో క్రికెట్ పై ప్రాచుర్యానికి పెంచేందుకు రకరకాల కార్యక్రమాలు చేపట్టింది.

వాస్తవానికి అమెరికాకు క్రికెట్ కొత్త కాదు. 18వ దశకంలో బ్రిటన్ పరిపాలన కాలంలో అమెరికా క్రికెట్ ఆడింది. అమెరికా మొదటి దేశ అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ విపరీతంగా క్రికెట్ చూసేవారు. 1844లో అమెరికా వేదికగా కెనడా వర్సెస్ సెయింట్ జార్జి క్లబ్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ వ్యాప్తికి సంబంధించి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఏకపక్ష పోకడలకు పాల్పడటంతో అమెరికా ఆ ఆట నుంచి వైదొలిగింది. 1860 తర్వాత బేస్ బాల్ వైపు వెళ్లిపోయింది.

ఇన్ని పరిణామాల నేపథ్యంలో అమెరికాలో ఐసీసీ క్రికెట్ ను వ్యాప్తి చేయడంలో సఫలీకృతమైంది. పైగా అమెరికా జట్టు కూడా సూపర్ -8 కు వెళ్లేందుకు అడుగులు వేస్తోంది. ఈ జట్టు లీగ్ దశలో బలమైన పాకిస్తాన్ జట్టును ఓడించింది. కెనడాపై రికార్డు స్థాయిలో చేజింగ్ చేసింది. ఇవన్నీ కూడా అమెరికన్ పౌరులను క్రికెట్ చూసేందుకు అడుగులు వేసేలా చేస్తున్నాయి. ఇక ఐసీసీ ఉత్సాహం దాదాపుగా నెరవేరిన నేపథ్యంలో.. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కలలు సాకారమవుతాయని తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ ఐసీసీ తయారుచేసిన మైదానాల వల్ల విమర్శలు వ్యక్తం అవుతున్నప్పటికీ.. క్రికెట్ అసలు సిసలైన క్రీడా మజాను అందిస్తుండడంతో చాలామంది అమెరికన్లు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. వారు కేవలం క్రికెట్ ఆటను ఆస్వాదిస్తున్నారు. సమీప భవిష్యత్తులో క్రికెట్ కూడా బేస్ బాల్ స్థాయిలో ఆదరణ దక్కించుకుంటుందని ఐసిసి భావిస్తోంది.