
T20 World Cup : నిన్నా మొన్నటి వరకు కెప్టెన్ గా భారత క్రికెట్ పై తనదైన ముద్రవేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తాడు. మెంటార్ గా మారిపోయాడు. దుబాయ్ వేదికగా జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత టీమ్ కు మెంటార్ గా ఉండబోతున్నాడు. ఈ మేరకు బీసీసీఐ కోరడం.. ధోనీ అంగీకరించడం జరిగిపోయింది. బుధవారం రాత్రి భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెంటార్ విషయాన్ని కూడా అనౌన్స్ చేసింది.
గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ధోనీ కొనసాగుతున్నాడు. అయితే.. సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో అద్భుతాలను చేసి చూపించాడు మహీ. కెప్టెన్ కూల్ గా ప్రశంసలు అందుకున్న ధోనీ.. చారిత్రాత్మక విజయాలు సాధించాడు. తన నాయకత్వంలో తొలిసారి 2007 టీ20వరల్డ్ కప్ సాధించిన ధోనీ.. ఆ తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ముద్దాడాడు. ఈ విధంగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన టీమిండియా కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. అలాంటి ధోనీ అనుభవం జట్టుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మెంటార్ గా రంగంలోకి దించింది బీసీసీఐ.
దీంతో.. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 వరల్డ్ కప్ సాగినన్ని రోజులు టీమిండియాకు మెంటార్ గా వ్యవహరించనున్నాడు ధోనీ. కెప్టెన్ కోహ్లీకి, ఇతర జట్టు సభ్యులకు పరిస్థితులను బట్టి ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే సలహాలు, సూచనలు చేయనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ వెల్లడించారు.
‘‘ఐపీఎల్-2021 కోసం ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ధోనీతో నేను మాట్లాడాను. టీ20 వరల్డ్ కప్ టీమ్ కి మెంటార్ గా ఉండేందుకు అతను ఒప్పుకున్నాడు. కెప్టెన్ విరాట్ తోపాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకూ ఈ విషయాన్ని చెప్పాను. వాళ్లు కూడా అంగీకరించారు.’’ అని జైషా తెలిపారు.
దీంతో.. ధోనీ మెంటార్ షిప్ అంశం హాట్ టాపిక్ గా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో, ఐసీసీ టోర్నీల్లో మహీ అనుభవం చాలా పెద్దది. మరి, అలాంటి ధోనీ భారత జట్టుతో మెంటార్ గా వెళ్తుండడంతో.. ఈ సారి కప్పు తప్పకుండా పట్టుకొచ్చేస్తారా? అనే చర్చ కొనసాగుతోంది. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ కొట్టిన తర్వాత.. మళ్లీ ఇప్పటి వరకు భారత్ కు అది దక్కలేదు. మరి, ధోనీ మెంటార్ గా వెళ్తున్న నేపథ్యంలో ఈ సారి సాధ్యమవుతుందా? అనేది చూడాలి.
ఇక, బుధవారం ప్రకటించిన భారత జట్టులో స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు చోటు దక్కలేదు. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ కు సైతం నిరాశే ఎదురైంది. టీమ్ ఇలా ఉంది. కోహ్లీ (కెప్టెన్). రోహిత్ శర్మ (వైఎస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరున్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్, షమీ. ఈ జట్టుతోపాటు స్టాండ్ బై ప్లేయర్లుగా.. శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ను సెలక్ట్ చేశారు.