Dharmavaram Minor Girl Incident: కంటిని కనురెప్ప కాటేస్తే.. చేనును కంచె మేస్తే.. అటువంటిదే ఈ సంఘటన. సభ్య సమాజం తలదించుకునేలా.. మనిషి పుట్టుక మీద ఏవగింపు కలిగేలా.. జరిగింది ఈ దారుణం.. ఇంతకంటే ఘోరం.. ఇంతకు మించిన పైశాచికం మరొకటి ఉండదు.
అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం. ఈ పట్టణంలో ఓ జంట నివాసం ఉంటుంది. వీరికి వివాహం జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సంతానం కలగలేదు. దీంతో సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఈ దంపతులు చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయ ప్రాంతం నుంచి ఆడ శిశువును తెచ్చుకున్నారు. అప్పటినుంచి తమ బిడ్డగా సాకుతున్నారు. ప్రస్తుతం ఆ పాపకు 14 సంవత్సరాల వయసు.
ఇటీవల ఆ బాలిక ఆస్వస్థతకు గురైంది. ఈ విషయాన్ని తనను పెంచుకుంటున్న పెంపుడు తల్లితో చెప్పింది. దీంతో ఆమె ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చిందని చెప్పారు. దీంతో ఆ బాలికను పెంచుకుంటున్న పెంపుడు తల్లి ఒక్కసారిగా షాక్ అయింది. ఆ తర్వాత ఈ దారుణానికి కారణం తన సోదరుడు అని భావించి అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ బాలికను విచారించారు. ఈ సందర్భంగా దారుణమైన విషయాలు వెలుగు చూసాయి.
ఆ బాలికపై పెంపుడు తండ్రి కొంతకాలంగా దారుణానికి పాల్పడుతున్నాడు. పెంపుడు తల్లి సోదరుడు కూడా ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలను పూసగుచ్చినట్టు ఆ బాలిక వెల్లడించడంతో కారకులు ఎవరో బయటపడింది. ప్రస్తుతం వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. ఆ బాలిక ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడుతోందని ధర్మవరం ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. చిన్నతనంలోనే గర్భం దాల్చడం వల్ల ఆమె శరీరంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. వైద్యులు అంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతున్నప్పటికీ.. వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం వారు ఆమెను అత్యవసర వైద్య విభాగంలో చేర్పించారు. అక్కడి ప్రత్యేక గదిలో ఆమెను ఉంచి చికిత్స అందిస్తున్నారు.