Pakistan cricket : పాకిస్తాన్ జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా విమర్శలు చేస్తున్న వారిలో ముందు వరసలో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో పాకిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా చేరిపోయాడు. స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను పాకిస్తాన్ O-2 తేడాతో కోల్పోయిన నేపథ్యంలో గ్లోబల్ మీడియా సైతం ఆ జట్టును తీవ్రంగా దుయ్యబడుతోంది. సొంత దేశంలో ఒక్క విజయం కూడా లేకుండా పాకిస్తాన్ పది టెస్టులను సమాప్తం చేసింది . 2021 నుంచి పాకిస్తాన్ జట్టుకు ఒక్క గెలుపు కూడా దక్కలేదు.
పాకిస్తాన్ ఆడిన గత పది మ్యాచ్లలో.. ఆరింట్లో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్లను డ్రా గా ముగించుకుంది. బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాత్రమే కాదు.. బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలోనూ సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను మాత్రం డ్రాగా ముగించుకుంది. ఈ వరుస ఓటములతో పాకిస్తాన్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దారుణమైన ర్యాంకును సొంతం చేసుకుంది. 1965 తర్వాత పాకిస్తాన్ అత్యంత పేలవమైన టెస్ట్ ర్యాంక్ సాధించడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ జట్టు ఇలాంటి ఓటములు ఎదుర్కోడాన్ని ఆ జట్టు మాజీ స్పిన్నర్ కనేరియా జీర్ణించుకోలేకపోతున్నాడు.. కెప్టెన్ గా ఎవరైనా నియమిస్తే.. జట్టులోని మిగతా ఆటగాళ్లు అతనికి అండగా నిలవాలి అని కోరాడు. అంతేతప్ప వెన్నుపోటు పొడిస్తే జట్టుకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని హెచ్చరించాడు. గంభీర్ లాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలని సూచించాడు..
వన్డే వరల్డ్ కప్ లో దారుణమైన ఓటమి తర్వాత బాబర్ అజామ్ ను కెప్టెన్సీ నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలగించింది. ఆ తర్వాత t20 లలో షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్ గా నియమించింది. టెస్టుల బాధ్యత షాన్ మసూద్ కు అప్పగించింది. ఒక సిరీస్ తర్వాత ఆఫ్రిదిని వెంటనే తొలగించింది. ఆ తర్వాత బాబర్ కు మళ్లీ టి20 ఫార్మాట్ కెప్టెన్సీ అప్పగించింది. ఇప్పుడు బాబర్ అజామ్, షాన్ మసూద్ కు కూడా ఉద్వాసన పలికే యోజనలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇష్టానుసారంగా కెప్టెన్లను మార్చుతున్నారు
” ఇష్టానుసారంగా కెప్టెన్లను మార్చుతున్నారు. కొత్త వాళ్లను నియమిస్తున్నారు. అందువల్లే పాకిస్తాన్ క్రికెట్ పతనమవుతోంది. సారధిని మార్చినంత మాత్రాన జట్టుకు విజయాలు రావు. కెప్టెన్ కు ఆటగాళ్లు అండగా ఉండాలి. కెప్టెన్ మెరుగైన ప్రదర్శన చేయాలి. అలాంటి ప్రదర్శన చేయకపోతే కెప్టెన్ తన పదవి నుంచి తప్పుకోవాలి. ఇలాంటి కఠిన నిర్ణయాలు జట్టు మేనేజ్మెంట్ అమలు చేయకపోతే పాకిస్తాన్ క్రికెట్ బాగుపడదు.. పాకిస్తాన్ క్రికెట్ తో పోల్చితే భారత క్రికెట్ ఎన్నో రెట్ల ముందుంది. గౌతమ్ గంభీర్ రాకతంలో టీమిండియా పనిచేస్తోంది. గౌతమ్ గంభీర్ ముక్కుసూటి వ్యక్తి. అది అతడి ముఖాన్ని చూస్తేనే అర్థమవుతుంది. అతడు కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. జట్టు మేనేజ్మెంట్ అలాంటి స్వేచ్ఛ ఇచ్చింది. కానీ ఇలాంటి సందర్భాన్ని పాకిస్తాన్ జట్టులో చూడలేం. అలాంటివి జరగనంతవరకు పాకిస్తాన్ క్రికెట్ బాగుపడదు. ఇందులో ఎటువంటి సందేహం లేదని” కనేరియా వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ జట్టుపై కనేరియా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.