MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్. మెన్ ఇన్ బ్లూ టీం కు అప్రతిహత విజయాలు అందించిన నాయకుడు. వన్డే, టీ -20 వరల్డ్ కప్ లు సాధించిపెట్టిన సారథి. కేవలం టీం ఇండియాకు మాత్రమే కాదు.. ఐపీఎల్ లో చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. నాలుగు పదుల వయసులోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకొని రుతు రాజ్ గైక్వాడ్ కు ఆ బాధ్యతలు అప్పగించి సంచలనం సృష్టించాడు. అయినప్పటికీ అతని ఆట తీరులో ఏమాత్రం మార్పు లేదు. కీపింగ్, బ్యాటింగ్ విషయంలో అదే ఉత్సాహం కనిపిస్తోంది.
చెన్నై జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఏడు మ్యాచ్ లు ఆడింది. నాలుగు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం లక్నో జట్టుపై జరిగిన మ్యాచ్ లో అపజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది.. అయితే ఈ జట్టు సంబంధించి ధోని ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. వాస్తవానికి ధోని టీమిండియా కెప్టెన్ గా ఉన్నప్పుడు మిడిల్ ఆర్డర్లో వచ్చేవాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా వచ్చి.. శ్రీలంకపై 79 బంతుల్లో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియాను విజేతను చేశాడు. ఆ తర్వాత తను టీమిండియా కు గుడ్ బై చెప్పేంతవరకు మిడిల్ ఆర్డర్ లోనే బ్యాటింగ్ చేశాడు. అయితే ప్రస్తుత ఐపీఎల్ లో ధోని ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు.
ధోని చివర్లో బ్యాటింగ్ కు వస్తుండడం పట్ల రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై చెన్నై జట్టు కోచ్ ఫ్లెమింగ్ స్పందించాడు.” అతను(ధోని) ఆట చివరి 2-3 ఓవర్ల మధ్యలో రావాలని కోరుకుంటున్నాడు. ఆ ఓవర్ల మధ్యలోనే సంతృప్తికరమైన ఆటను ఆడుతున్నాడు. అతడి ఆట చూసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల అభిమానానికి తగ్గట్టుగానే అతడు కూడా అదే స్థాయిలో ఆడుతున్నాడు.. మేము కూడా అతని ఆట చూసి ఆనందిస్తున్నాం. అతడు నెట్స్ లో చేస్తున్న సాధన, ఇతర విషయాలను మేము గమనిస్తున్నాం. చివర్లో వచ్చి మా జట్టును అతడు పైకి తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో అందరి ప్రేమ మా జట్టుకు లభిస్తోందని” ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
మరోవైపు ధోని చివర్లో బ్యాటింగ్ కు వస్తున్నప్పటికీ.. అభిమానుల అంచనాలను ఏమాత్రం వమ్ము చేయడం లేదు. ఇటీవల ఢిల్లీ పై 16 బంతుల్లో 37 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లున్నాయి. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం నాలుగు బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ధోని ఈ ఘనత సాధించాడు. హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టడంతో పాండ్యా ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయాడు. ఆ మ్యాచ్లో ధోని చేసిన ఆ 20 పరుగులే చెన్నైని గెలిపించాయి. ఇక శుక్రవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సీజన్లో అతడు 255.88 స్ట్రైక్ రేట్ కొనసాగిస్తున్నాడు.