India T20 World Cup warning: మరో రెండు వారాల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు తమ ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. ఈసారి టోర్నీలో బంగ్లాదేశ్ ఆడటం లేదు. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
2024 లో జరిగిన పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను ఓడించింది. ఈసారి స్వదేశంలో t20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. జట్టులో ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో ఆడుతున్న నేపథ్యంలో ఈసారి టీమిండియా ట్రోఫీ అందుకుంటుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టి20 వరల్డ్ కప్ కంటే ముందు ప్రాక్టీస్ లాగా ఉంటుందని భావించి న్యూజిలాండ్ జట్టుతో స్వదేశం వేదికగా టీమిండియా ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఇందులో ఇప్పటికే సిరీస్ గెలిచింది టీం ఇండియా. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి.. న్యూజిలాండ్ జట్టును ఓడించింది. తద్వారా వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో t20 మ్యాచ్లో టీమిండియా దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. హార్దిక్ పాండ్యా దారుణంగా నిరాశపరిచాడు. ఇక బౌలింగ్ లో కూడా టీమిండియా లోపం స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేయడం టీమిండియా బౌలింగ్ లోపాన్ని మరోసారి ప్రస్ఫుటం చేసింది.
శివం దుబే కనుక అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ కీలకమైన ప్లేయర్లు నిరాశపరచడంతో టీమిండియా ఓడిపోక తప్పలేదు. ఈ మైదానం మీద భారీగా పరుగులు సాధించే అవకాశం ఉన్నప్పటికీ.. టీమిండియా ప్లేయర్లు ఒకరి వెంట ఒకరు అన్నట్టుగా అవుట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ ముందు ఆటగాళ్ల ప్రదర్శన మరోసారి చర్చకు వచ్చింది. ఈ ఓటమి టీమ్ ఇండియాకు ఒక మేల్కొలుపు లాంటిదని.. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇకపై మ్యాచ్ లు టీమిండియా ఆడాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బౌలింగ్లో లోపం కనిపించిందని.. బ్యాటింగ్లో సమిష్టి తత్వం లోపించిందని.. వీటిని సరిదిద్దుకుంటే టీమిండియాకు టి20 వరల్డ్ కప్ లో సానుకూల ఫలితాలు వస్తాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. లేనిపక్షంలో ఇదే ధోరణి కొనసాగిస్తే టీమిండియా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.