The Ashes 2025-26: ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మొత్తానికి ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. మూడు వరుస ఓటముల తర్వాత దక్కిన ఈ గెలుపు ఇంగ్లాండ్ జట్టుకు ఒక రకంగా బలమైన ఉపశమనం లాంటిది. ఇంగ్లాండ్ సాధించిన ఈ విజయం దాదాపు ఐదు ఓటముల తర్వాత దక్కింది. అందువల్లే ఈ విజయాన్ని ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మెల్బోర్న్ మైదానంలో అయితే ఇంగ్లాండ్ అభిమానులు కంట నీరు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. దీని వెనుక బలమైన కారణం కూడా ఉంది.
ఇంగ్లాండ్ జట్టు బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా మీద ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు సాధించిన ఈ విజయం రొటీన్ క్రికెట్ అభిమానులకు పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ ఈ విజయం ఎంతటి గొప్పదో ఇంగ్లాండ్ అభిమానులకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టుతో జరిగే బూడిద పోరాటంలో ఇంగ్లాండ్ జట్టు చివరిసారిగా అంటే 2011లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డమీద ఒక విజయం సాధించడానికి ఇంగ్లాండ్ జట్టు దాదాపు 14 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. స్థూలంగా చెప్పాలంటే 5468 రోజుల తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా మీద గెలుపును అందుకుంది.
ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు వరుసగా మూడు ఓటములు ఎదుర్కొంది. సాధారణంగా ఇలాంటి ఓటములు ఎదుర్కొన్న ఏ జట్టైనా సరే బౌన్స్ బ్యాక్ అవడం అంత ఈజీ కాదు. పైగా ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లు మూడో టెస్ట్ మధ్యలో లభించిన గ్యాప్‌లో విపరీతంగా మద్యం తాగారని.. కనీసం హోటల్ రూమ్‌లోకి వచ్చే సోయి కూడా వారికి లేదని ప్రఖ్యాతమైన బీబీసీ స్టోరీ కూడా టెలికాస్ట్ చేసింది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజ్మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బెన్ డకెట్ కు సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ జట్టు మీద ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించాయి.
ఇన్ని ఇబ్బందుల మధ్య మెల్ బోర్న్ మైదానంలోకి అడుగుపెట్టింది ఇంగ్లాండ్ జట్టు. తొలి ఇన్నింగ్స్ లో 110 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో బాక్సింగ్ డే టెస్ట్ కూడా ఓడిపోతుందని స్పోర్ట్స్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. ఇప్పటికైతే ఇంగ్లాండ్ జట్టు యాషెస్ సిరీస్ ఓడిపోవచ్చు గాక. కానీ బాక్సింగ్ డే టెస్ట్ లో మాత్రం ఇంగ్లాండ్ గెలిచింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆస్ట్రేలియా జట్టుకు యాషెస్ సాధించిన ఆనందాన్ని బూడిదలో పోసింది. బజ్ బాల్ వంటి క్రికెట్ విఫల ప్రయత్నం కావచ్చు గాక. కానీ పోరాటం అనేది ఇంగ్లాండ్ జట్టు నరనరాల్లో ఉంది. అందువల్లే ఈ స్థాయిలో విజయం సాధించింది.