Ind Vs Aus 4th Test: మెల్ బోర్న్ మైదానంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకే అవుట్ కావడంతో సోషల్ మీడియాలో #happy retirement అనే యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అయింది. కొంతమంది విరాట్ కోహ్లీని కూడా ఇందులో చేశారు. వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని.. ఇక వీడ్కోలు పలకడమే ఉత్తమమని అభిమానులు ఆ పోస్టులో వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు.
మెల్ బోర్న్ మైదానంలో టీమిండియా కెప్టెన్ అన్ని విభాగాలలో విఫలం కాగా.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మాత్రం విజయవంతమయ్యాడు. ఒత్తిడిలో మొక్కవోని స్థైర్యాన్ని ప్రదర్శించగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఒత్తిడిలో చిత్తయ్యాడు. కనీసం తన సహజ శైలికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యాడు. నిర్ణయాలు తీసుకోవడంలోనూ నిరాశ వాదాన్ని కనబరిచాడు. దీంతో టీమిండియా ఓడిపోక తప్పలేదు. తొలి ఇన్నింగ్స్ లో కమిన్స్ 49 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు.. ఇందులో రోహిత్ శర్మ వికెట్ కూడా ఉంది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో జట్టు టాప్ ఆటగాళ్లు మొత్తం విఫలమైనప్పటికీ.. లబూ షేన్ కు తోడ్పాటు అందిస్తూ విలువైన 41 పరుగులు చేశాడు. అంతేకాదు బౌలింగ్ లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. రోహిత్, రాహుల్, జైస్వాల్ వికెట్లను సాధించి.. ఆస్ట్రేలియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
రోహిత్ విషయంలో..
ఒత్తిడి విషయంలో రోహిత్ ఏమాత్రం తట్టుకోలేడు. అది. మెల్ బోర్న్ టెస్టులో మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే బ్యాటింగ్లో రోహిత్ వైఫల్యం కనిపించింది. ఈ సిరీస్లో రోహిత్ ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగిన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేదు. బౌలింగ్ కూర్పు.. ఫీల్డింగ్ మార్పు విషయంలోనూ తన మార్క్ ప్రదర్శించలేదు. బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోలేదు. కొత్త బంతిని తీసుకున్న అతడు సిరాజ్, ఆకాష్ దీప్ తోనే బౌలింగ్ చేయించాడు. ఈ దశలో బుమ్రా తో బౌలింగ్ చేస్తే ఫలితం మరో విధంగా ఉండేది. కానీ అలా చేయకుండా రోహిత్ తన నిర్లక్ష్యాన్ని చాటుకున్నాడు. కష్ట సమయంలో.. ఒత్తిడి ఎదురైన సందర్భంలో ఆశావాదం వైపు కమిన్స్ అడుగులు వేయగా.. రోహిత్ మాత్రం ఒత్తిడికి చిత్తయ్యాడు. ఫలితంగా తన ఆధ్వర్యంలో జట్టుకు రెండో ఓటమిని అందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లే అవకాశాలను కూడా ప్రమాదంలో పడేశాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో దారుణమైన ఓటమిని మిగిల్చి.. అభిమానులను ఆవేదనలో కూరుకుపోయేలా చేశాడు.