https://oktelugu.com/

Rahul Dravid: కోచ్ పదవి లేదు.. ఖాళీగా ఉన్నాను.. ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి..

Rahul Dravid: వెస్టిండీస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను ఓడించి టీమిండియా విజేతగా నిలవడంతో ద్రావిడ్ ఆనందానికి అవధులు లేవు. ఇదే సమయంలో ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 1, 2024 / 05:50 PM IST

    Rahul Dravid jokes about being jobless

    Follow us on

    Rahul Dravid: 2007లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలోని టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటికి వచ్చింది. అత్యంత అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఆ వరల్డ్ కప్ లో దారుణమైన ఆట తీరు నేపథ్యంలో ద్రావిడ్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. సరిగ్గా 2021లో టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా ఆట తీరును పూర్తిగా మార్చేశాడు. యువకులను సాన పెట్టి భవిష్యత్తు ఆశాకిరణాలుగా రూపొందించాడు. అందువల్లే టీమిండియా ఐసీసీ నిర్వహించిన టెస్ట్, వన్డే, టి20 ఫార్మాట్ ల పోటీలలో ఫైనల్ చేరుకుంది. టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ కోల్పోయినప్పటికీ.. టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను ఓడించి టీమిండియా విజేతగా నిలవడంతో ద్రావిడ్ ఆనందానికి అవధులు లేవు. ఇదే సమయంలో ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో.. విజయంతో కోచ్ పదవికి గుడ్ బై చెప్పేసాడు..

    టీమిండియా ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ద్రావిడ్ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. కన్నీటిని తుడుచుకుంటూ టీమ్ ఇండియాతో తన ప్రయాణాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా టీమ్ ఇండియా ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్ తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. అతన్ని తమ చేతుల్లోకి ఎత్తుకొని గాల్లో సరదాగా ఎగిరేసారు. ఇక ద్రావిడ్ కోచ్ పర్యవేక్షణలో టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఏకంగా ఎనిమిది విజయాలు సాధించింది. ఐర్లాండ్ జట్టుతో మొదలైన విజయప్రస్థానం దక్షిణాఫ్రికా వరకు కొనసాగింది. ఇక వన్డే వరల్డ్ కప్ లోనూ ఫైనల్ మ్యాచ్ మినహా.. మిగతా అన్నింట్లోనూ టీమిండియా ఏకపక్ష విజయాలు సాధించింది.

    కోచ్ గా ద్రావిడ్ ను కొనసాగాలని బిసిసిఐ కోరినప్పటికీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. దీంతో జై షా ఆ మధ్య స్పందించాడు. కొత్త కోచ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టామని వెల్లడించారు. ఇక టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ గెలవడంతో ఆ ఉద్విగ్న క్షణాన్ని ద్రావిడ్ ఆస్వాదించారు. అనంతరం తన ఆనందాన్ని విలేకరులతో పంచుకున్నాడు. ” ఇప్పుడు నా కోచ్ పదవి కాలం పూర్తయింది. ఒకరకంగా చెప్పాలంటే నాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు నేను ఒక నిరుద్యోగిని. ఏమైనా ఉద్యోగాలు ఉంటే చెప్పండి. ఈ ఆనందం నుంచి తేరుకునేందుకు కొంచెం సమయం పడుతుంది. దీని నుంచి త్వరగా బయటపడి ముందుకు సాగాలి కదా. వచ్చేవారం నుంచి నా జీవితం కొత్తగా మొదలవుతుంది. కాకపోతే పెద్ద మార్పు ఏది ఉండదు. అప్పటికే నేను నిరుద్యోగిగా ఉంటాను” అంటూ ద్రావిడ్ సరదాగా వ్యాఖ్యానించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. అయితే రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా కొనసాగాలని రాహుల్ ద్రావిడ్ పలుమార్లు మంతనాలు జరిపాడు. అయితే దానికి ద్రావిడ్ ఒప్పుకోలేదు. “ద్రావిడ్ తో గడిపిన క్షణం మాకు చాలా గొప్పది. ఆయన అనుభవం మాకు ఉపకరించింది. టీమిండియా ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అందుకు ముఖ్య కారణం రాహుల్ ద్రావిడ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని” ఆ మధ్య ఓ సందర్భంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. మరోవైపు 2007లో తన కెప్టెన్సీలో సాధించలేని ప్రపంచ కప్ ను రాహుల్ ద్రావిడ్ కోచ్ గా టి20 వరల్డ్ కప్ ను ఒడిసి పట్టాడు. తన జీవితంలో ఉన్న వెలితిని పూడ్చుకున్నాడు.