Kavya maran : ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs KKR) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.. వెంకటేష్ అయ్యర్ (60), రఘు వంశీ (50) సూపర్బ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ బౌలర్లు ప్రారంభంలో మెరుగ్గానే బౌలింగ్ వేసినప్పటికీ.. ఆ తర్వాతే పరుగులు ధారాళంగా ఇచ్చారు. ఒకానొక దశలో 106/4 వద్ద ఉన్న కోల్ కతా జట్టు 200/6 పటిష్ట స్థితికి చేరుకుంది. ఫలితంగా హైదరాబాద్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది.
చేతులెత్తేశారు
201 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడింది. వరుస ఎదురు దెబ్బలు తగలడంతో ఆ జట్టు కోలుకోకుండా అయ్యింది..హెడ్(4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్(3), నితీష్ కుమార్ రెడ్డి (19) ఇలా కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో హైదరాబాద్ జట్టు స్వల్ప స్కోర్ కే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో స్టేడియంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అవుతుండడంతో హైదరాబాద్ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.. అయితే అవుట్ అయిన నలుగురు ఆటగాళ్లు అత్యంత నిర్లక్ష్యమైన షాట్లు కొట్టడం వల్లే పెవిలియన్ చేరుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు ఊరించే బంతులు వేస్తుంటే.. ఏ మాత్రం పసిగట్ట లేకుండా సన్ రైజర్స్ ఆటగాళ్లు వారి ఉచ్చులో చిక్కుకున్నారు.. కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ ఏడుపు ముఖం పెట్టింది. ఆమె ముఖంలో బాధ ప్రస్ఫుటంగా కనిపించింది. ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆమె విచార వదనంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఆమె అలా ఉండడాన్ని చూసి హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాపం కావ్య పాప అంటూ సోషల్ మీడియాలో తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఆమెకు ధైర్య వచనాలు చెబుతున్నారు. “కావ్య పాప జట్టుపై ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఆటగాళ్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసింది. వారు కోరుకున్న సదుపాయాలు మొత్తం కల్పించింది. కానీ ఆటగాళ్లు మాత్రం అంతగా సీరియస్ నెస్ చూపించడం లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. ఆడుతోంది ఐపీఎల్ మ్యాచ్ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి.. మైదానాన్ని వీడుతున్నారు. ఇలా అయితే హైదరాబాద్ జట్టు కప్ ఎలా గెలుస్తుంది.. పాపం కావ్య పరిస్థితి దారుణంగా ఉందని” హైదరాబాద్ అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యానిస్తున్నారు.