India vs Australia: ఒకసారి ఓడిపోతే దురదృష్టం అనుకుంటాం. మరోసారి ఓడిపోతే టైం బాగోలేదు అనుకుంటాం. మూడోసారి కూడా ఓడిపోతే.. దాన్నేమనాలి? క్రికెట్లో ఆ జట్టు బాధ ఎలా ఉండాలి? ఆ బాధను గత 21 సంవత్సరాలుగా టీమిండియా అనుభవిస్తోంది. గాయం అయిన చోటే దెబ్బ తగులుతోంది. ఆ గాయానికి ఇప్పుడు లేపనం పూసే సమయం వచ్చింది. ఈ ఉత్కంఠ భరిత సమయంలో టీమిండియా ఎంత గట్టిగా ఆడితే అభిమానులకు అంత సంతోషం. స్థూలంగా చెప్పాలంటే రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే అసలు సమయం.
కపిల్ దేవ్ నాయకత్వంలో ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. భారత క్రికెట్ జట్టు మళ్ళీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది.. 2003 లో భారత జట్టుకు ఆ అవకాశం లభించింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత జట్టు.. ఆ తర్వాత వరుస విజయాలతో ఫైనల్ దాకా వెళ్ళింది.. ఫైనల్ లోనూ లీగ్ దశలో సీన్ రిపీట్ అయింది. ఫలితంగా కప్ ముంగిట భారత్ బోల్తా పడింది. కోట్లాదిమంది అభిమానులకు నిరాశను మిగిల్చింది.
2023లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరిగింది. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా వరుస విజయాలతో ఫైనల్ దాకా వెళ్ళింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా మరోసారి ఆస్ట్రేలియా ముందు తలవంచాల్సి వచ్చింది. ఒత్తిడిలో తీవ్ర ఇబ్బంది పడి వికెట్లను పడేసుకుంది.. కట్టడిలోనూ ప్రత్యర్థి జట్టు ముందు సాగిలపడింది.. దీంతో మరోసారి భారత జట్టుకు దారుణమైన పరాభవం ఎదురయింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ ఇదే సన్నివేశం పునరావృతమైంది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. టెస్ట్ గదను కంగారు జట్టుకు ఇచ్చేసి , రిక్త హస్తాలతో వెనక్కి తిరిగి వచ్చేసింది..
టి20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు ఎదురేలేదు.. లీగ్ దశలో పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే సూపర్ -8 లో బంగ్లాదేశ్ వరకు ఎదురు పడిన ప్రతి జట్టునూ ఓడించుకుంటూ వచ్చింది. ఇప్పటివరకు నక్కల వేటను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో అసలైన కుంభస్థలం కళ్ళ ముందు నిలిచి ఉంది. లక్షల మంది అభిమానులకు నిర్వేదాన్ని మిగులుస్తామని చెప్పి మరీ ఓడించిన ఆస్ట్రేలియాను.. ఇప్పుడు ఇంటిదారి పట్టించే సమయం ఆసన్నమైంది ఆస్ట్రేలియా కెప్టెన్ మిచల్ మార్ష్ కూడా 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కమిన్స్ లాగే హెచ్చరిక చేశాడు.. చెప్పి మరి మనల్ని బోల్తా కొట్టించడం ఆస్ట్రేలియా కెప్టెన్లు అలవాటుగా మార్చుకున్నారు. ఇలాంటి వారికి కచ్చితంగా బుద్ధి చెప్పాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడిస్తే వారు ఇంటికి వెళ్లి పోతారు.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్లో.. ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే చాలు.. కాబూలీ సేన సెమీస్ వెళ్తుంది. ఇది జరగాలంటే టీమిండియా కచ్చితంగా గెలవాలి. ఇన్ని రోజులపాటు కొంతమంది ఆటగాళ్లు ఆడకపోయినప్పటికీ.. మిగతావారు జట్టు భారాన్ని మోసుకుంటూ వచ్చారు. కానీ ఆస్ట్రేలియాతో అలా కాదు.. కచ్చితంగా సమష్టి తత్వాన్ని ప్రదర్శించాల్సిందే. ఏమాత్రం అవకాశం లభించినా చాలు ఆస్ట్రేలియా చెలరేగిపోతుంది. చూస్తుండగానే చేతులో నుంచి మ్యాచ్ లాగేసుకుంటుంది. పైగా సెయింట్ లూసియాలో సోమవారం వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. రోహిత్ సేన ఖాతాలో ఐదు పాయింట్లు ఉంటాయి. అప్పుడు దర్జాగా భారత్ సెమీస్ వెళ్తుంది. దీనివల్ల ఆస్ట్రేలియా ఖాతాలో మూడు పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు బంగ్లాదేశ్ పై ఆఫ్గనిస్తాన్ విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా చరిత్ర క్లోజ్ అవుతుంది. వర్షం మీద ఆధారపడకుండా.. సెమీస్ లేదా ఫైనల్ లో ఆస్ట్రేలియా ఎదురు పడకూడదనుకుంటే టీమిండియా గట్టిగా ఆడాలి. ఆస్ట్రేలియాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి.