Ms Dhoni: మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీం ఇండియాకు టి20, వన్డే వరల్డ్ కప్ లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ధోనికే సాధ్యం. మైదానంలో చురుకుగా కదిలే నైపుణ్యం ధోని సొంతం. అందుకే టీం ఇండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీకి ప్రధమ స్థానం ఉంటుంది. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ధోని క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్న అతడికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వాడైనప్పటికీ చెన్నై అభిమానులు అతడిని తలా అని పిలుస్తుంటారు.. అటువంటి ధోనికి విరాట్ కోహ్లీతో మంచి అనుబంధం ఉంది. చాలా సందర్భాల్లో వారిద్దరూ తమ మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పారు.. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావించాడు..” విరాట్ తో కలిసి 2008 -09 కాలం నుంచి నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. మా ఇద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది. అతడు నాకు సోదరుడవుతాడా? సహచరు అవుతాడా? అనే విషయంలో అభిమానులు ఎలాంటి పేరు పెట్టారో నాకు తెలియదు. భారత జట్టు కోసం మేమిద్దరం చాలా సంవత్సరాల పాటు ఆడాం. మైదానంలో మేమిద్దరం సహచరులుగా నడుచుకున్నాం.. అత్యుత్తమ ఆటగాడు ఎవరు అనే ప్రశ్న నన్ను అడిగితే రెండవ మాటకు తావు లేకుండా నేను చెప్పే సమాధానం విరాట్ కోహ్లీ పేరు మాత్రమే” అని ధోని పేర్కొన్నాడు.
మరోవైపు వచ్చే ఏడాది కి సంబంధించిన ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ధోని ఆడే విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఇంబ్యాక్ట్ ఆటగాడి విధానం లేదా అన్ క్యాప్ డ్ ప్లేయర్ నిబంధనలకు బీసీసీఐ పచ్చ జెండా ఊపితే చెన్నై తరఫున ధోని ఆడేందుకు అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే సీజన్లో చెన్నై తరఫున ధోని ఆడాలని ఒకప్పుటి అతడి సహచరుడు సురేష్ రైనా కోరాడు..” రుతు రాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై జట్టు వచ్చే సీజన్లో మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తుందని భావిస్తున్నాను. అతడు నాయకుడిగా స్థిరపడేందుకు ఇంకా కొంచెం సమయం ఇవ్వాలి. ఇటీవలి సీజన్ లో రుతు రాజ్ నాయకత్వంలో చెన్నై బలమైన అడుగులే వేసింది. వచ్చే సీజన్లో ధోని భాయ్ చెన్నై తరపున ఆడితే చూడాలని ఉందని” రైనా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా వ్యక్తం చేశాడు.