Asia Cup Dispute: భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరసన.. దానికి శ్రీలంక, ఒమన్ క్రికెట్ సంఘాల సమర్ధన.. ఈ నేపథ్యంలో అసలు ఆసియా కప్ జరుగుతుందా? లేదా? అనే సందేహం ఉండేది. అయితే ఈ ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆసియా కప్ నిర్వహణకు పచ్చ జెండా ఊపింది. అనేక తర్జనభర్జనలు.. చర్చల తర్వాత ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఆసియా కప్ ను యునైటెడ్ అరబ్ ఎమైరేట్స్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆహ్వానిస్తాన్, హాంకాంగ్, ఒమన్, యూఏఈ జట్లు ఆసియా కప్ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి.
Also Read: బీఆర్ఎస్, బీజేపీ విలీనం.. కేటీఆర్ ఇప్పుడేమంటారు?
టి20 ఫార్మాట్లో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. మొత్తంగా 20 రోజులపాటు ఈ టోర్నీ జరుగుతుంది. పాకిస్తాన్, భారత్ ఒకే గ్రూపులో ఉండడం విశేషం. అబుదాబి, దుబాయ్ మైదానాలలో ఈ టోర్నీ నిర్వహిస్తారు. లీగ్ దశ పూర్తయిన తర్వాత ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్ లో పోటీపడేందుకు అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్ లో ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒకసారి పోటీ పడాల్సి ఉంటుంది. ఇందులో విజయాలు సాధించిన జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి.. గ్రూపు- ఏ లో ఒమన్, యూఏఈ, పాకిస్తాన్, ఇండియా ఉన్నాయి. గ్రూప్ బి లో హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 14 ఆదివారం నాడు ఇండియా, పాకిస్తాన్ తలపడతాయి.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడిన నేపథ్యంలో.. దాయాది దేశంతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. అంతేకాదు పాకిస్తాన్ నిర్వహించే ఏ టోర్నీలో కూడా ఆడకూడదని.. హైబ్రిడ్ విధానంలో మాత్రమే ఆడాలని భారత క్రికెట్ నియత్రణ మండలి నిర్ణయించింది. కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. మిగతా అన్ని క్రీడలకు కూడా వర్తిస్తుందని ఇతర సంఘాలు వెల్లడించాయి.. అయితే ఇటీవల వెటరన్ క్రికెటర్లు ఛాంపియన్స్ క్రికెట్ లీగ్ లో తలపడ్డారు. ఇందులో భారత జట్టు పాకిస్తాన్ జట్టుతో తలపడలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులున్న నేపథ్యంలో తాము పాకిస్తాన్ దేశంతో ఆడబోమని.. దేశ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా తమ నడుచుకోమని స్పష్టం చేశారు.. భారత వెటరన్ క్రికెటర్లు తీసుకొన్న నిర్ణయం సంచలనం కలిగించింది.
Also Read: ఫ్రస్టేషన్ లో జనసేన ఎమ్మెల్యేలు..’సర్దుకుపోవడం’ పై అసంతృప్తి!
మరోవైపు ఆసియా కప్ లో భారత్ – పాకిస్తాన్ మధ్య పోరు జరుగుతుందా? అనే అనుమానాలు నిన్నటి వరకు ఉండేవి. షెడ్యూల్ విడుదలైన తర్వాత భారత్, పాకిస్తాన్ తలపడతాయని స్పష్టమైనది. అయితే చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల ఢాకా లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తామని ఎసిసి అధ్యక్షుడు నఖ్వి ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యతిరేకించింది. అంతేకాదు ఆ దేశంలో సమావేశం నిర్వహిస్తే తమ హాజరుకాబోమని స్పష్టం చేసింది. దీంతో సమావేశాన్ని వేరే ప్రాంతంలో నిర్వహించాల్సి వచ్చింది.