Coco Gauff US Open Champion: చిన్న వయసులోనే ఆమె టెన్నిస్ పై మమకారం పెంచుకుంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి యూఎస్ ఓపెన్ పోటీలను తిలకించేందుకు క్రమం తప్పకుండా మైదానానికి వచ్చేది. ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో తీక్షణంగా పరిశీలించేది. వాళ్ళ అడుగులు, కొడుతున్న ఫోర్ హ్యాండ్ షాట్లు, చేస్తున్న తప్పిదాలను అదే పనిగా చూసేది. 11 ఏళ్ల తర్వాత అదే బాలిక 19 సంవత్సరాల వయసుకు వచ్చింది. టీనేజ్ వయసులో ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి.. ఆ ఉడుకును తన ఆటలో చూపించింది. ఫలితంగా యూఎస్ ఓపెన్ టైటిల్ కొట్టేసింది. తన ఆరాధ్య క్రీడాకారిణి సెరెనా విలియమ్స్, ఆమె సోదరీ వీనస్ విలియమ్స్ ఆట చూస్తూ ఎంజాయ్ చేసిన ఈ క్రీడాకారిణి.. వారు ఆడిన మైదానంలోనే ట్రోఫీ అందుకొని మరో నల్ల కలువగా అవతరించింది. ఫ్లసింగ్ మెడోస్ లో ఛాంపియన్ గా అవతరించి సరికొత్త రికార్డు సృష్టించింది. పాత జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగా మ్యాచ్ పాయింట్ సాధించగానే కోర్టులో మోకాళ్లపై కూర్చుని తీవ్ర భావోద్వేగానికి గురైంది.
యూ ఎస్ ఓపెన్ ట్రోఫీ సాధించిన 19 సంవత్సరాల కొకొ గాఫ్ ది క్రీడాకారుల కుటుంబమే. ఆమె తండ్రి కోరి గాఫ్ యూనివర్సిటీ స్థాయి బాస్కెట్ బాల్ ఆటగాడు. తల్లి క్యాండీ గాఫ్ కు సహజంగానే ఆటలపై మక్కువ ఎక్కువ. అప్పటికే విలియమ్స్ సోదరీమణుల అభిమాని అయిన గాఫ్ టెన్నిస్ ను కెరియర్ గా ఎంచుకుంది. ఈ క్రమంలో తమ కూతురు తమ కూతురు ట్రైనింగ్ కోసం గాఫ్ తల్లిదండ్రులు తమ కెరియర్లను వదులుకున్నారు. మెరుగైన శిక్షణ కోసం టెన్నిస్ కోచ్ ఫ్యాట్రిక్ మొరాటోగ్లూ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫ్రాన్స్ లోని అతడి అకాడమీలో గాఫ్ 2014లో చేరింది. ప్యాట్రిక్ సుదీర్ఘకాలం సెరెనా విలియమ్స్ కు కోచ్ గా వ్యవహరించాడు.
18 సంవత్సరాల వయసులో అండర్_12 అమెరికా నేషనల్ టెన్నిస్ క్లే కోర్ట్ ఛాంపియన్ షిప్ దక్కించుకున్న పిన్న వయసు ప్లేయర్ గా రికార్డు నెలకొల్పింది. జూనియర్ స్థాయిలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకుని అబ్బురపరిచిన ఆమె, 2018లో 14 సంవత్సరాల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్ లో అడుగుపెట్టింది. 15 సంవత్సరాలకే వింబుల్డన్ లో అడుగుపెట్టింది. నాలుగవ రౌండ్ కు చేరడం ద్వారా ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో అతి చిన్న వయసులో ఈ రౌండ్ కు చేరిన క్వాలిఫైయర్ గా మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రెండుసార్లు ఫ్రీ క్వార్టర్స్ వరకు వెళ్లిన గాఫ్.. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్ గా నిలిచింది. కాగా, ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ కొకొ గాఫ్ 2_6, 6_3, 6_2 తేడాతో రెండవ సీడ్ అరియానా సబలెంక( బెలారస్) ను ఓడించింది. ఈ క్రమంలో 1999లో సెరెనా విలియమ్స్(17 ఏళ్లు) తర్వాత యూఎస్
ఓపెన్ నెగ్గిన తొలి అమెరికా టీనేజర్ గా గాఫ్ (19 ఏళ్ళు) రికార్డు సృష్టించింది. ఈ విజయంతో ప్రపంచ మూడోవ ర్యాంకుకు గాఫ్ ఎగబాగింది. ఈ ట్రోఫీ సాధించడం ద్వారా గాఫ్ కు 24.94 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. సబలెంక కు 12.47 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.