CSK Vs GT 2023: ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రికార్డ్‌.. పదోసారి ఫైనల్‌కు.. ఎలా సాధ్యమవుతోంది?

చెన్నై జట్టు ఐపీఎల్‌లో అత్యధికంగా ఫైనల్స్‌లో(తొమ్మిది) ఆడిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. జట్టు 2020, 2022లో మాత్రం లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఆ ఏడాదిల్లో వరుసగా ఏడు, తొమ్మిదో స్థానంలో నిలిచింది.

Written By: Raj Shekar, Updated On : May 24, 2023 10:39 am

CSK Vs GT 2023

Follow us on

CSK Vs GT 2023: గత ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో ఐపీఎల్‌ జాబితాలో చివరన నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఈసారి అదరగొడుతోంది. పడి లేచిన కెరటంలా ఈఏడాది ఫస్ట్‌ ఆఫ్‌లో కాస్త తడబడినా.. సెకండాఫ్‌లో సూపర్‌ పెర్షార్మెన్స్‌తో ఫైనల్‌కు దూసుకెళ్లంది. మంగళవారం జరిగిన మొదటి సెమీ ఫైనల్స్‌లో సొంత గడ్డపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో విశేషంగా రాణించిన ఈ మాజీ చాంపియన్‌ ఏకంగా పదోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

తొలి క్వాలిఫయర్‌లో విజయం
డిపెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. లక్ష్య ఛేదనలో తిరుగులేని టైటాన్స్‌కు పరిస్థితులు అనుకూలించలేదు. మంచు ప్రభావం లేకపోవడంతో బౌలర్లదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఓడిన టైటాన్స్‌ శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఎలిమినేటర్‌ పోరు విజేతతో ఆరోజు తలపడనుంది.

చెన్నై ఆల్‌రౌండ్‌ షో..
ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 60), కాన్వే (34 బంతుల్లో 4 ఫోర్లతో 40), జడేజా (16 బంతుల్లో 2 ఫోర్లతో 22) రాణించారు. షమీ, మోహిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గిల్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 42), రషీద్‌ ఖాన్‌ (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) మాత్రమే రాణించారు. దీపక్‌ చాహర్, తీక్షణ, జడేజా, పథిరణకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రుతురాజ్‌ నిలిచాడు.

చెన్నై ఖాతాలో మరో రికార్డు..
క్వాలిఫైయర్‌ 1లో డిపెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించిన చెనై్న సూపర్‌ కింగ్స్‌ జట్టు ఫైనల్‌లోకి దూసుకెళ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధికసార్లు ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా చెన్నై నలిచింది. 14 ఏళ్లలో 12 సార్లు సీఎస్‌కే ప్లేఆఫ్‌కు చేరుకుంది. 10సార్లు ఫైనల్‌కు చేరుకుంది. నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఐపీఎల్‌ జట్టుగా అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ప్లేఆఫ్స్‌కు 16 సీజన్లలో 10 సార్లు అర్హత సాధించిన ముంబై ఇండియన్స్‌ ప్రస్తుతం జాబితాలో రెండవ స్థానంలో ఉంది.

2020, 2022లో తడబాటు..
చెన్నై జట్టు ఐపీఎల్‌లో అత్యధికంగా ఫైనల్స్‌లో(తొమ్మిది) ఆడిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. జట్టు 2020, 2022లో మాత్రం లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఆ ఏడాదిల్లో వరుసగా ఏడు, తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ రెండు సీజన్‌ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరిగాయి. 2020లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఐపీఎల్‌ జరిగింది 2022 ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు గ్రౌండ్‌లలో జరిగాయి.

విజయాల్లోనూ రికార్డు..
ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కూడా రికార్డు ఉంది. ఇప్పటి వరకు 223 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 129 గెలిచింది. 2011లో ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి 19 మ్యాచ్‌లు ఆడి 12 విజయాలు సాధించింది. క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌లలో సీఎస్‌కే ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచింది. రెండుసార్లు ఓడిపోయింది.

చెన్నై ప్రదర్శనలు ఇలా..

2011లో.. క్వాలిఫైయర్‌ 1: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. ఫైన్‌ల్‌ మ్యాచ్‌ చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగగా, సీఎస్‌కే 58 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది.

2012లో.. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే 38 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.
చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్‌ 2లో సీఎస్‌కే 86 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది.
ఇదే స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా చేరితో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

2013లో..ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన క్వాలిఫైయర్‌ 1లో సీఎస్‌కే 48 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే ముంబై ఇంయిన్స్‌ చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.

2014లో.. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో నిర్వహించిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. క్వాలిఫైయర్‌ 2లో పంజాబ్‌ చేతిలో 24 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది.

2015లో.. క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌ ముంబై వాంఖడే మైదానంలో నిర్వహించారు. ఇందులో సీఎస్‌కే 25 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిపోయింది. క్వాలిఫయర్‌2 రాంచిలో నిర్వహించగా ఇందులో మూడు వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చెన్నై చిత్తు చేసింది. ఫైనల్‌ మ్యాచ్‌ ఈడెగార్డెన్స్‌లో జరుగగా 41 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిపోయింది.

2018లో.. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్లింది. ఫైనల్‌ కూడా వాంఖడే స్టేడియంలో జరిగింది. ఇందులో 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను సీఎస్‌కే ఓడించి విజేతగా నిలిచింది.

2019లో.. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో చెన్నై ఓడిపోయింది. విశాఖపట్నంలో జరిగిన క్వాలిఫైయర్‌ 2లో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఫైనల్‌ హైదరాబాద్‌లో నిర్వహించగా, ముంబైతో తలపడిన చెన్నై ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.

2021లో.. క్వాలిఫైయర్‌ 1 దుబాయ్‌లోని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగింది. ఇందులో సీఎస్‌కే నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఫైనల్‌ మ్యాచ్‌ కూడా అదే మైదానంలో నిర్వహించగా, 27 పరుగులతో కోల్‌కతాను సీఎస్‌కే చిత్తు చేసింది.

2023లో.. తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగగా, గుజరాత్‌ టైటాన్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించింది.