https://oktelugu.com/

SRH vs CSK : సన్ రైజర్స్ చిత్తుగా.. ప్లే ఆఫ్ ముందు ఏంటి ఈ చెత్తాట?

హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో ఓటమితో వరుసగా రెండు పరాజయాలను హైదరాబాద్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికైతే పాయింట్లు పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. ఇక వచ్చే మ్యాచ్లలో హైదరాబాద్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ప్లే ఆఫ్ ఆశలు గల్లంతవుతాయి.

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2024 / 09:51 AM IST

    SRH Vs CSK 2024

    Follow us on

    SRH vs CSK : ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించింది. ఆ తర్వాత వేగంగా పుంజుకుంది. బలమైన చెన్నై, బెంగళూరు, ముంబై జట్లపై విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో 277, 287 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంకేముంది హైదరాబాదుకు తిరుగులేదని అందరూ అనుకున్నారు. ఈసారి కప్ కొడుతుందని అభిమానులు భావించారు. కానీ, జరుతున్నది వేరు. మొన్నటి దాకా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్క సారిగా మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఆరవ స్థానంలో ఉన్న చెన్నై మూడవ స్థానానికి వచ్చింది. ఇందుకు కారణం చెన్నై వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు దారుణమైన ప్రదర్శన.. ఏకంగా 78 పరుగుల తేడాతో చెన్నై జట్టు చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. ఈ విజయంతో చెన్నై జట్టు హైదరాబాద్ పై రివెంజ్ తీర్చుకుంది.

    టాస్ గెలిచినప్పటికీ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ 98, మిచెల్ 52, శివం దుబే 39* దూకుడుగా ఆడటంతో చెన్నై జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లకు 212 రన్స్ చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు 18.5 ఓవర్లలో 134 రన్స్ కు ఆల్ ఔట్ అయింది. హైదరాబాద్ జట్టులో మార్క్రం చేసిన 32 పరుగులే హైయెస్ట్ స్కోర్ అంటే వారి బ్యాటింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. చెన్నై బౌలర్లలో తుషార్దేశ్ పాండే 4 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఓటమిని శాసించాడు. ముస్తాఫిజుర్, పతిరనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

    చేజింగ్ ను ధాటిగా మొదలు పెట్టాలని భావించిన హైదరాబాద్ కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పవర్ ప్లే లో కీలకమైన హెడ్ 13, అన్ మోల్ ప్రీత్ సింగ్(ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్) 0, ను తుషార్ దేశ్ పాండే వరుస బంతుల్లో అవుట్ చేశాడు. అభిషేక్ శర్మ 15 ను కూడా వెనక్కి పంపించాడు. ఈ దశలో నితీష్ రెడ్డి 15, మార్క్రమ్ 32 జాగ్రత్తగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఆటగాళ్లు అనవసరమైన షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న క్లాసెన్ 19 ఔట్ కావడంతో హైదరాబాద్ శిబిరంలో ఒక్కసారిగా నిరాశ అలముకుంది.

    ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. అజంక్య రహనే 9 రన్స్ చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. డారిల్ మిచెల్ , రుతు రాజ్ గైక్వాడ్ చెన్నై ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. రెండవ వికెట్ కు 64 బంతుల్లో 107 రన్స్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో అర్థ సెంచరీ చేసిన మిచెల్ అవుటయ్యాడు. ఆ తర్వాత శివం దుబే, రుతు రాజ్ గైక్వాడ్ దూకుడుగా ఆడారు.. 98 పరుగులు చేసిన రుతు రాజ్ రెండు పరుగుల దూరంలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ధోని రెండు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ లో ఓటమితో వరుసగా రెండు పరాజయాలను హైదరాబాద్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికైతే పాయింట్లు పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. ఇక వచ్చే మ్యాచ్లలో హైదరాబాద్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ప్లే ఆఫ్ ఆశలు గల్లంతవుతాయి.