Jasprit Bumrah : స్వదేశంలోనే కాదు, విదేశాల్లోనూ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. నిర్జీవమైన మైదానంపై వికెట్లు పడగొట్టడంలో అతడికి అతడే సాటి. ఇలాంటి పరిస్థితుల్లోనైనా బంతి నుంచి స్వింగ్ రాబడతాడు. పదునైన పేస్ తో బంతులు వేసి అదరగొడతాడు. అందువల్లే అతడిని ఈ కాలపు స్పీడ్ గన్ అని పిలుస్తుంటారు. పాకిస్తాన్ నుంచి మొదలుపెడితే ఆస్ట్రేలియా వరకు అతడి చేతిలో విలవిలలాడని జట్టు అంటూ లేదు. ఉదాహరణకు మెల్ బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ నే తీసుకుంటే.. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు ఈ మైదానంపై 474 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు పండగ చేసుకున్న ఈ ఇన్నింగ్స్ లోనూ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి అతడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కు చుక్కలు చూపించాడు. కొన్ స్టాస్, హెడ్, మార్ష్, క్యారీ వికెట్లను పడగొట్టి ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇందులో కొన్ స్టాస్ వికెట్ బుమ్రా పడగొట్టిన విధానం ఈ మ్యాచ్ కే హైలెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అరుదైన రికార్డు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్న బుమ్రా.. మరో సంచలనానికి నాంది పలికాడు. సరికొత్త రికార్డు సృష్టించి టీమిండియాలో ఒకే ఒక బౌలర్ గా ఆవిర్భవించాడు. వేగంగా 200 వికెట్లు తీసిన క్లబ్లో చేరిన బుమ్రా అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్ వకార్ యూనిస్ 7725 బంతులలో 200 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ డెల్ స్టెయిన్ 7848 బంతుల్లో 200 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా మరో బౌలర్ కగిసో రబాడ 8153 బంతుల్లో 200 వికెట్లు నేల కూల్చాడు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో బుమ్రా కూడా చేరాడు. 8484 బంతుల్లో 200 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో చేరాడు. అయితే ఈ జాబితాలో టీమిండియా తరఫున బుమ్రా మాత్రమే ఉండడం విశేషం. గొప్ప గొప్ప బౌలర్లకు సాధ్యంకా రికార్డును బుమ్రా సృష్టించడం ఇక్కడ విశేషం. బుమ్రా సాధించిన రికార్డు పట్ల నెట్టింట ప్రశంసలు దక్కుతున్నాయి. ” టీమిండియా కు దొరికిన ఆణిముత్యం అతడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు బౌలింగ్ చేస్తాడు. వికెట్ల మీద వికెట్లు పడగొడతాడు. అందువల్లే అతడు ఈ స్థాయిలో ఘనతను సొంతం చేసుకుంటున్నాడు. అతడు టీమిండియాకు వెన్నెముకలాగా మారిపోయాడని” నెటిజన్లు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.