KL Rahul : ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి త్వరలో మెగా వేలం జరగనుంది. దీనికి సంబంధించి నిబంధనలు ఇంకా పూర్తికాలేదు. అయినప్పటికీ చర్చలు మాత్రం ఆగడం లేదు. ప్రధాన మీడియాలోనూ ఆటగాళ్లకు సంబంధించిన వేలం.. ఇతర ప్రక్రియలపై తామర తంపరగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో స్టార్ ఆటగాళ్లు జట్లు మారుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో లక్నో జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తావన కూడా ఉంది. రాహుల్ కు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీస్తోంది. ఆ వీడియోలో రాహుల్ బెంగళూరు జట్టుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టుకు వెళ్లాలని ఆశగా ఉందని రాహుల్ వ్యాఖ్యానించడంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఏముందంటే
రాహుల్ బెంగళూరు జట్టుకు చెందిన ఓ వీరాభిమానితో మాట్లాడాడు. ఆ మాటలకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీశారు. దానిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ” నేను బెంగళూరు జట్టుకు డై హార్డ్ కోర్ ఫ్యాన్.. చాలా సంవత్సరాల నుంచి బెంగళూరు జట్టుకు నా హృదయపూర్వక మద్దతిస్తున్నాను. మీరు గతంలో బెంగళూరు జట్టుకు ఆడారు. ప్రస్తుతం కొన్ని పుకార్లు మీపై వస్తున్నాయి. వాటి గురించి ప్రస్తావించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కాకపోతే మీరు బెంగళూరు జట్టుకు తిరిగి రావాలి. మీ స్థాయి ప్రదర్శన చూపించాలి. మీరు సత్తా చాటుతూ ఉంటే మేము చూడాలని” ఆ అభిమాని రాహుల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
రాహుల్ ను తీసుకుంటారా?
ఆ అభిమాని వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ స్పందించాడు. అలాగే జరగాలని అతడు కామెంట్ చేశాడు.. ఇక ఐపీఎల్ లో ఇప్పటివరకు 17 సీజన్లో విజయవంతంగా పూర్తి అయ్యాయి. ముంబై, చెన్నై జట్లు 5 టైటిల్స్ తో తొలి స్థానంలో కొనసాగుతున్నాయి. ఇటీవల సీజన్ లో కోల్ కతా విజేతగా నిలిచింది. ఫైనల్ లో హైదరాబాద్ జట్టుపై ఘనవిజయం సాధించింది.. అయితే బెంగళూరు జట్టు ప్రతి సీజన్లోనూ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. కప్ కలను సాకారం చేసుకోకుండానే నిరాశగా వెను తిరుగుతోంది.. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ అదే ఫలితం వస్తోంది. అయితే వచ్చే సీజన్ కు సంబంధించి బెంగళూరు కఠినమైన ప్రణాళికలను అమలు చేస్తుందని ఆ జట్టు అభిమానులు అంచనా వేస్తున్నారు. కెప్టెన్ డూ ప్లెసిస్ ను మార్చుతారని పేర్కొంటున్నారు. అదే సమయంలో కేఎల్ రాహుల్ ఒకవేళ వేలంలోకి వస్తే భారీ ధరను చెల్లించైనా బెంగళూరు యాజమాన్యం తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
బెంగళూరు జట్టు ద్వారానే ఎంట్రీ
కేఎల్ రాహుల్ బెంగళూరు జట్టు ద్వారానే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2013 నుంచి 16 వరకు బెంగళూరు జట్టు తరుపున ఆడాడు. గాయం వల్ల 2017 సీజన్ లో ఆడలేకపోయాడు. 2018లో మెగా వేలానికి ముందు పంజాబ్ జట్టుకు వెళ్ళిపోయాడు. నాలుగు సంవత్సరాలు అతడు పంజాబ్ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత 2022 మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జట్టుకు మారిపోయాడు. ఇటీవల సీజన్లో లక్నో జట్టు యజమాని సంజీవ్ రాహుల్ ను మైదానంలోనే మందలించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో రాహుల్ మనస్థాపానికి గురి కావడంతో జట్టు మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది
A Die heart #RCB fan requested KL Rahul to comeback to RCB
– The response by Rahul was quite cute #Cricket #IPL2025 #DuleepTrophy#INDvsBAN #KLRahul #LSG
— Pratyush Halder (@pratyush_no7) September 15, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More