BCCI womens team: భారత మహిళా క్రికెట్ జట్టు 47 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఊ రించుకుంటూ వస్తున్న వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో 2005, 2017 లో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. ఒకసారి ఆస్ట్రేలియా చేతిలో.. మరొకసారి ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. తద్వారా వరల్డ్ కప్ కలను సొంతం చేసుకోలేకపోయింది. అయితే ఈసారి స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఎటువంటి పొరపాటుకు తావు ఇవ్వలేదు. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో.. టీం ఇండియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు దూసుకుపోయింది. ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుతాన్ని సృష్టించి.. ఆవిష్కరించింది. 100 కోట్ల భారతీయుల కలను నిజం చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 298 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్లో సత్తా చూపించింది. టీమిండియా బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా ప్లేయర్లు కీలక దశలో చేతులెత్తేశారు. ఒత్తిడి తట్టుకోలేక సెంచరీ చేసిన లారా అవుట్ కావడంతో.. దక్షిణాఫ్రికా పతనం వేగంగా సాగిపోయింది. ఓ వైపు భారత బౌలర్లు కీలక సమయాలలో వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు ఇబ్బంది పడిపోయింది. అయితే మరో ఎండ్ లో లారా ఉండడంతో దక్షిణాఫ్రికా కాస్త ధైర్యంతోనే ఉంది. ఎప్పుడైతే లారా అవుట్ అయిందో.. అప్పటినుంచే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. చివర్లో టీమిండియా బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యానికి దూరంగా ఉండిపోయింది. దీంతో దశాబ్దాల నాటి నిరీక్షణకు టీమిండియా చెక్ పెట్టింది.
టీమిండియా అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో విపరీతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. కౌర్ నుంచి మొదలు పెడితే స్మృతి మందాన వరకు తమ సాధించిన విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మహిళలకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వరల్డ్ కప్ సాధించిన టీమిండియా కు 51 కోట్ల నజరానా ప్రకటించింది. ఇక ఐసీసీ టీమ్ ఇండియాకు 39 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తుంది. మొత్తంగా ఐసిసి, బీసీసీఐ ఇచ్చే ప్రైజ్ మనీ 90 కోట్లకు చేరుకుంటుంది. ఈ నగదును ఆటగాళ్లకు, శిక్షకులకు, సహాయక సిబ్బందికి పంపిణీ చేస్తారు. పురుషుల జట్టు గత ఏడాది టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 125 కోట్ల ప్రైజ్ మనీని బిసిసిఐ ప్రకటించింది. అయితే వరల్డ్ కప్ సాధించిన మహిళల జట్టుకు మాత్రం 51 కోట్ల నజరానా ఇచ్చింది. “మహిళలు అద్భుతాన్ని సృష్టించారు. దశాబ్దాల కాలం పాటు కలగా ఉన్న వన్డే వరల్డ్ కప్ ను నిజం చేసి చూపించారు. ఇదంతా కూడా ప్లేయర్ల శ్రమ వల్ల సాధ్యమైంది. వారి పట్టదల వల్ల సార్ధకమైంది. అందు గురించే బీసీసీఐ నుంచి ఈ నజరానా ప్రకటిస్తున్నామని” బీసీసీఐ కార్యదర్శి దేవదత్ సైకియా ప్రకటించారు.