Homeక్రీడలుOdi World Cup 2023: బీసీసీఐ నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు శాపం..!

Odi World Cup 2023: బీసీసీఐ నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు శాపం..!

Odi World Cup 2023: భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ కు బిసిసిఐ ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్టోబర్ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అయితే, ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఆడే మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడాలని కోరుకునే అభిమానుల సంఖ్య తక్కువ ఏమీ కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కోట్లాది మంది అభిమానులు వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలని భావిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలను అడియాశలు చేసేలా బీసీసీఐ.. భారత్ ఆడే మ్యాచ్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ స్టేడియాలకు వేదికగా కేటాయించలేదు. వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లను ఆడించేందుకు హైదరాబాద్ స్టేడియాన్ని ఎంపిక చేసినప్పటికీ.. భారత్ ఆడే మ్యాచ్ ఒక్క మ్యాచ్ ను కేటాయించకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని అత్యంత ప్రాధాన్యత నగరాల్లో హైదరాబాద్ ఒకటి. చారిత్రకంగా, రాజకీయంగా, భౌగోళికంగా, అభివృద్ధి పరంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల సరసన నిలుస్తుంది భాగ్యనగరం. ప్రపంచ కప్ లో భారత జట్టు ఆడే మ్యాచ్ లకు మిగతా నాలుగు ప్రధాన నగరాలను ఎంపిక చేసింది కానీ హైదరాబాదుకు మాత్రం ఆ అవకాశాన్ని కల్పించలేదు బీసీసీఐ. దీంతో అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ కు మాత్రం పాకిస్తాన్ రెండు క్వాలిఫైయర్ జట్లతో ఆడే రెండు మ్యాచ్లు, న్యూజిలాండ్ క్వాలిఫైయర్ జట్టుతో ఆడే మరో మ్యాచ్ ను మాత్రమే కేటాయించింది బీసీసీఐ. ప్రపంచ కప్ ప్రధాన మ్యాచులకు ఆతిధ్యం ఇవ్వబోతున్న పది నగరాల్లో భారత్ ఆడే మ్యాచ్ లేని ఏకైక వేదిక హైదరాబాద్ కావడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాలపై బీసీసీఐ చిన్న చూపు..

కీలక మ్యాచ్లను ఎప్పుడూ ఉత్తరాదిలోని కీలక నగరాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. దక్షిణాదిలోను మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అంటే బీసీసీఐకి ఎప్పుడూ చిన్నచూపే. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజీవ్ గాంధీ స్టేడియం ఉన్నప్పటికీ దీనిని వినియోగించుకునేందుకు బీసీసీఐ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. అంతర్జాతీయ మ్యాచులు నిర్వహణ, వీక్షణకు అత్యంత అనువైనదిగా ఈ మైదానానికి పేరు ఉంది. విశాఖలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి కూడా అంతే పేరు ఉంది. ఇక్కడ కనీసం మ్యాచ్ నిర్వహించేందుకు కూడా బీసీసీఐ మొగ్గు చూపించడం లేదు. అంతర్జాతీయ మ్యాచ్లు జరిగినప్పుడల్లా ఈ నగరాల్లోని స్టేడియాలో కిక్కిరిసిపోతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు గురించి సచిన్, ధోని, కోహ్లీ సహా స్టార్ క్రికెటర్లంతా గొప్పగా మాట్లాడిన వారే. కానీ తెలుగు రాష్ట్రాలను మాత్రం బీసీసీఐ చిన్న చూపు చూస్తూ పక్కన పెడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్నది మూడో వన్డే వరల్డ్ కప్. ఇంతకు ముందు 1987లో పాకిస్తాన్ తో కలిసి, 2011లో శ్రీలంక, బంగ్లాదేశ్ భాగస్వామ్యంలో భారత్ ప్రపంచ కప్ నిర్వహించింది. 1987లో హైదరాబాద్ కు భారత్ ఆడే మ్యాచ్ ను కేటాయించలేదు. అప్పుడు ఎల్బీ స్టేడియంలో న్యూజిలాండ్, జింబాబ్వే మ్యాచ్ జరిగింది. 2011లో హైదరాబాద్ కు ప్రపంచ కప్ ఆతిధ్య అవకాశం దక్కలేదు. ఈసారి మహారాష్ట్రలోని ముంబైతోపాటు పూణేకు భారత జట్టు ఆడే మ్యాచ్లను కేటాయించిన బీసీసీఐ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క స్టేడియానికి కూడా ఈ అవకాశాన్ని కల్పించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గత పదేళ్లలో కేటాయించిన మ్యాచులు తక్కువే..

ఇక ద్వైపాక్షిక సిరీస్ ల సమయంలోనూ తెలుగు రాష్ట్రాల్లోని స్టేడియాల పట్ల బీసీసీఐ వివక్షను ప్రదర్శిస్తోంది. కోటా ప్రకారం చూసినా ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్ విశాఖకు గత పదేళ్లలో కేటాయించిన మ్యాచుల సంఖ్య చాలా తక్కువే. అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియాన్ని పునర్నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా మార్చిన తర్వాత దానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా కాదు. అహ్మదాబాద్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని నగరం. ఇక్కడి మైదానానికి మోడీ పేరు పెట్టారు. దీంతో గత రెండేళ్లలో దేశంలోని మరే స్టేడియానికి లేని విధంగా టి20 మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. వరల్డ్ కప్ లో కూడా భారత్, పాకిస్తాన్ తో మ్యాచ్ తోపాటు వరల్డ్ కప్ ప్రారంభ, ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కీలక నగరాల్లో ఉన్న స్టేడియాలకు అవకాశం కల్పించకుండా అహ్మదాబాద్ నగరంలోని స్టేడియానికి ఎక్కువ అవకాశాలు కల్పించడం పట్ల క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మరో చోట స్టేడియాలు లేవన్నట్లుగా ఒకే మైదానానికి కీలక మ్యాచ్లను కట్టబెట్టడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నోరు మెదపని క్రికెట్ సంఘాలు..

బీసీసీఐ తెలుగు రాష్ట్రాల స్టేడియాల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ సంఘాలు నోరు మెదపకపోవడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. భాగ్యనగరానికి జాతీయ స్థాయిలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మ్యాచ్ కేటాయింపు విషయమై హైదరాబాద్ క్రికెట్ సంఘం బీసీసీఐను నిలదీయకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్రికెట్ సంఘాల ప్రతినిధులు, అధికారులు బిసిసిఐతో సంప్రదింపులు జరిపి కీలక మ్యాచ్లను ఈ రెండు రాష్ట్రాల్లోని కీలక స్టేడియాల్లో జరిగేలా అవకాశాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. క్రికెట్ సంఘాన్ని నడిపించిన పెద్దలు, మాజీ క్రికెటర్లు అన్యాయంపై గొంతు విప్పకపోవడం పట్ల విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. బెంగళూరు, చెన్నైకు ప్రపంచ కప్ లో భారత్ మ్యాచ్ కేటాయించకపోతే అక్కడ క్రికెట్ సంఘాలు ఊరుకునేవి కావు. ఆ పరిస్థితి ఇక్కడ తలెత్తి ఉంటే బీసీసీఐ ఒక్క మ్యాచ్ అయినా ఆడించే అవకాశాన్ని కల్పించేదని అభిమానుల పేర్కొంటున్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ లేకపోవడం వల్లే బీసీసీఐ ఇష్టానుసారంగా చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్రికెట్ సంఘాలు బలంగా బీసీసీఐను నిలదీయాలని, మాజీ క్రికెటర్లు కూడా దీనిపై గట్టిగా ప్రశ్నించాలని పలువురు క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular