BCCI Shock To Rohit And Virat: టీమిండియాలో లెజెండరీ ఆటగాళ్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు పేరు ఉంది. వీరిద్దరూ టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించారు. ఫార్వర్డ్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వీరిద్దరూ అదరగొట్టి టీమ్ ఇండియాను విశ్వ వేదిక మీద విజేతగా నిలిపారు. అంతకుముందు టి20 వరల్డ్ కప్ లో కూడా వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కొన్ని సందర్భాలలో విరాట్ విఫలమైనప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం దుమ్ము రేపాడు. ఫలితంగా ఉత్కంఠ మధ్య దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించింది.
క్రికెట్లో విజయాలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. దీనికి విరాట్, రోహిత్ మినహాయింపు కాదు. పైగా ఇప్పుడు జట్టులో గౌతమ్ గంభీర్ రాజ్యం నడుస్తోంది. అందువల్లే రోహిత్ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవలసి వచ్చింది. విరాట్ కోహ్లీ కూడా అదే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల జట్టులో జరిగిన మార్పుల వల్ల రోహిత్ వన్డే ఫార్మాట్ నాయకుడి బాధ్యత నుంచి తప్పుకోవలసి వచ్చింది. వాస్తవానికి రోహిత్ శర్మకు 2027లో టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించాలని ఆశయం ఉండేది. 2023 లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోకుండా ఖచ్చితంగా ఆ కల నెరవేరేది. వెంట్రుక వాసిలో ఆ కల నెరవేరకుండా పోయింది. అయితే ఈసారి మేనేజ్మెంట్ నిర్వాకం వల్ల రోహిత్ కల ఇప్పటికీ కలగానే ఉండిపోనుంది. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో అతడు సాధారణ ఆటగాడు మాత్రమే.. గంభీర్ ఒత్తిడి వల్ల రోహిత్ తన స్థానం నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి గిల్ వచ్చేసాడు. కనీసం వన్డే వరల్డ్ కప్ వరకు అయినా రోహిత్, గిల్ టీమిండియాలో ఉంటారనుకుంటే.. అది కూడా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
2027 వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో రోహిత్, విరాట్ ఉండేది అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ ఆడే విషయంపై బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగర్కర్ సంచలన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అగర్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.. రోహిత్, విరాట్ అద్భుతమైన ప్లేయర్లని.. వ్యక్తిగతంగా భజన చేయడానికి టీమిండియా వేదిక కాదని.. వచ్చే రెండు సంవత్సరాలలో పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేమని.. వారి స్థానంలో యువ ఆటగాళ్లు రావచ్చని.. ఒకవేళ వారు కనుక ఆడితే అప్పుడు పరిశీలిస్తామని ఆగర్కార్ పేర్కొన్నాడు. పరుగులు ముఖ్యం కాదని.. ట్రోఫీలు మాత్రమే ప్రధానమని.. ఒకవేళ ఆస్ట్రేలియా సిరీస్ లో వారు వరుసగా మూడు సెంచరీలు చేసినప్పటికీ.. వరల్డ్ కప్ ఆడతారని నమ్మకం పెట్టుకోవద్దని అజిత్ అగర్కర్ స్పష్టం చేశాడు. ఒకవేళ అజిత్ అగర్కర్ మాటలు మేనేజ్మెంట్ నుంచి వచ్చి ఉంటే మాత్రం కచ్చితంగా ఇది రోహిత్, విరాట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. విరాట్ శరీర సామర్థ్యం ప్రకారం చూసుకుంటే వచ్చే వరల్డ్ కప్ వరకు ఆడే అవకాశం కనిపిస్తోంది. కానీ రోహిత్ విషయంలోనే అనుమానం గా ఉంది.