Champions Trophy 2025 2017 తర్వాత ఈ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ – భారత్ తలపడ్డాయి.. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈసారి డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు స్వదేశం వేదికగా జరిగిన ట్రై సిరీస్లో పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆ జట్టుపై ఒక రకంగా ఒత్తిడి అధికంగా ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎలాంటి ఆట తీరు ప్రదర్శిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు కూడా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే, టి20 సిరీస్ ను టీమిండియా దక్కించుకుంది. అయితే ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్ ట్రోఫీలో భారత్ కీలక బౌలర్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగుతోంది.. బుమ్రా ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్లో వెన్ను నొప్పికి గురయ్యాడు. అతని గాయం మానినప్పటికీ.. రిస్క్ వద్దని టీం మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చింది.
భారత్ ఫేవరెట్
బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోయినప్పటికీ భారత జట్టు ఫేవరెట్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు బలంగా ఉందని.. బుమ్రా లేకపోవడం లోటే అని.. అయినప్పటికీ భారత జట్టే ఫేవరెట్ అని.. బుమ్రా లేకపోయినప్పటికీ మిగతా బౌలర్లు భారత జట్టుకు విజయాన్ని అందించే సామర్థ్యం ఉన్నవారని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. “భారత జట్టు బలంగా ఉంది. కచ్చితంగా టాప్ -4 లో భారత్ కచ్చితంగా ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ ఇటీవల సెంచరీ చేసి టచ్లోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడు ఒక సూపర్ స్టార్. భారత జట్టుకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్.. ఒత్తిడిలోనూ.. విపత్కర పరిస్థితిలోనూ అతడు అద్భుతంగా ఆడతాడు. అందువల్లే టీమిండియా టైటిల్ ఫేవరెట్ నేను చెప్పగలను. బుమ్రా మాత్రమే గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. భారత జట్టులో మిగతా ఆటగాళ్లు మొత్తం పూర్తి సామర్థ్యంతో ఉన్నారు. అలాంటప్పుడు ఆ జట్టు మిగతా జట్లకు బలమైన పోటీ ఇవ్వగలదని” క్లార్క్ అభిప్రాయపడ్డాడు.
ఈసారి ఎలాగైనా..
కాగా, గత సీజన్లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఓటమిపాలైంది. కానీ ఇప్పుడు టైటిల్ దక్కించుకోవాలని భావిస్తోంది. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఉత్కంఠ పరిస్థితుల్లో గెలుపును దక్కించుకుంది. తద్వారా 17 సంవత్సరాల తర్వాత టి20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కెరియర్ చివరి దశలో ఉన్న నేపథ్యంలో.. ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టుకు అందించి వన్డేలకు కూడా వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు.