Aus Vs Ind 3rd Test: పెర్త్ టెస్టులో టీమిండియా బౌలింగ్ ఆస్ట్రేలియా జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అందువల్లే 295 పరుగుల తేడాతో విజయం దక్కింది. అడిలైడ్ టెస్ట్ విషయానికి వచ్చేసరికి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్ల మీద వికెట్లు తీస్తుంటే.. టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా యువ బౌలర్ హర్షిత్ రాణా ఆకట్టుకోలేకపోయాడు. సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోయాడు. బుమ్రా నే బౌలింగ్ భారాన్ని మోసాడు. సిరాజ్ కూడా తన వంతు సహకారాన్ని అందించాడు.. ఆస్ట్రేలియా మైదానాలు పేస్ కు అనుకూలంగా ఉంటాయి. అలాంటప్పుడు బౌలింగ్లో వైవిధ్యం కచ్చితంగా ఉండాలి. లేకుంటే ఆతిథ్య జట్టుతో ఇబ్బంది పడక తప్పదు. అయితే ఆడిలైడ్ టెస్టులో ఓటమి తర్వాత, భారత్ డిసెంబర్ 14 నుంచి మొదలయ్యే బాక్సింగ్ డే టెస్ట్ పై దృష్టి సారించింది. బ్రిస్బేన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. బాక్సింగ్ డే టెస్ట్ కావడంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఈ మ్యాచ్ పై ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాగైనా గెలవాలి. లేకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆశలు అడియాసలు అవుతాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగంలో అత్యంత పటిష్టంగా ఉంది. పెర్త్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో సత్తా చాటిన ఆ జట్టు బౌలర్లు.. రెండవ ఇన్నింగ్స్ విషయానికి వచ్చేసరికి తేలిపోయారు.. ఇక అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను 180, రెండవ ఇన్నింగ్స్ లో 175 పరుగులకు ఆల్ అవుట్ చేశారు.. స్టార్క్, కమిన్స్ టీమిండియా పతనాన్ని శాసించారు. బ్యాటింగ్ విభాగంలో హెడ్, లబూ షేన్ అదరగొట్టారు.. కానీ ఇదే ఆట తీరు టీమిండియా ప్లేయర్లు ప్రదర్శించలేకపోయారు.
వారి స్థానం మారుతుందా?
బ్రిస్బేన్ కూడా పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. అయితే బుమ్రా, సిరాజ్ మాత్రమే మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారు. నితీష్ రెడ్డి బ్యాట్, బంతితో ఆకట్టుకుంటున్నాడు. మూడవ పేసర్ అవసరం వచ్చినప్పుడు దిక్కులు చూడాల్సి వస్తోంది. పెర్త్ టెస్టులో ఈ అవసరం లేకపోయినప్పటికీ.. అడిలైడ్ టెస్టులో హర్షిత్ రాణా తేలిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే బ్రిస్బేన్ టెస్టులో హర్షిత్ రాణా స్థానంలో ఆకాశ్ దీప్ ను తీసుకుంటారని తెలుస్తోంది. పెద్ద టెస్టులో, పీఎం -11 జట్టుతో జరిగిన మ్యాచ్లలో హర్షిత్ రాణా అదరగొట్టినప్పటికీ.. అడిలైడ్ టెస్టులో విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఆకాశదీప్ ను తీసుకుంటారని సమాచారం. గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ మదిలో కూడా ఇదే ఆలోచన ఉందని తెలుస్తోంది. హర్షిత్ విషయంలో గౌతమ్ గంభీర్ సపోర్ట్ గా ఉన్నప్పటికీ… బ్రిస్బేన్ టెస్టులో టీం ఇండియా కచ్చితంగా గెలవాలి కాబట్టి హర్షిత్ స్థానంలో ఆకాష్ ను తీసుకుంటారని తెలుస్తోంది. ఆకాష్ దీప్ కు విదేశీ గడ్డమీద ఆడిన అనుభవం లేకపోయినప్పటికీ.. అతడు దేశవాళి క్రికెట్ టోర్నీలలో సంచలనం సృష్టించాడు. పైగా అతడు ఆకట్టుకునే పేస్ వేస్తున్నాడు. బౌలింగ్లో కొత్తదనం చూపిస్తున్నాడు. అందువల్లే అతనికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. ఒకవేళ బౌలింగ్ విషయంలో మరింత వైవిధ్యం కావాలి అనుకుంటే ప్రసిధ్ కృష్ణ కూడా అందుబాటులో ఉన్నాడు. ఒకవేళ అతనికి కనుక అవకాశం ఇస్తే ఇంకో ఆటగాడి పై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది..