Aus Vs Eng Ashes: ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ ఆడింది. దక్షిణాఫ్రికా జట్టును అత్యంత స్వల్ప స్కోర్ కు ఆల్ అవుట్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగుల లీడ్ సాధించింది టీమిండియా. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం టీమిండియా కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయింది. తద్వారా ఊహించని ఓటమిని సొంతం చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ను బౌలింగ్ కు అనుకూలంగా రూపొందించుకున్న టీం ఇండియా తగిన మూల్యం చెల్లించుకుంది.
ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా టీమ్ ఇండియా మాదిరిగానే ఇబ్బంది పడుతోంది. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆల్ అవుట్ అయింది. స్టార్క్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు దుమ్ము రేపడం ఖాయమని.. ఇంగ్లాండ్ జట్టుకు నరకం కనిపిస్తుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు.. కానీ ఇక్కడే ఇంగ్లాండ్ జట్టు అసలు సిసలైన గేమ్ ప్లాన్ మొదలుపెట్టింది.
మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 0 పరుగుల వద్ద ఓపెనర్ వెదర్ ల్యాండ్ వికెట్ కోల్పోయింది. ఆర్చర్ బౌలింగ్లో వెదర్ ల్యాండ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బ్రైడన్ కార్స్ దుమ్ము రేపాడు. అద్భుతమైన బంతులు వేసి కెప్టెన్ స్మిత్(17), ఖవాజా(2) వికెట్లను పడగొట్టాడు. దశలో హెడ్ (21), గ్రీన్ (24) జాగ్రత్తగా ఆడుతున్న క్రమంలో.. వారిద్దరిని అవుట్ చేసి స్టోక్స్ ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.. క్యారీ (26), స్టార్క్ (12), బోలాండ్ (0) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకొని.. పాంచ్ పటాకా సాధించాడు. వాస్తవానికి తొలిరోజే ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కాని చివర్లో ఓవర్లు ముగియడంతో క్రీజ్ లో లయన్ (3), డగట్ (0) ఉన్నారు.
పెర్త్ పిచ్ ను ఆస్ట్రేలియా బౌలర్లకు అనుకూలంగా మార్చింది. దీనికి తగ్గట్టుగానే ఆస్ట్రేలియా బౌలర్లు ముఖ్యంగా స్టార్క్ అదిరిపోయే రేంజ్ లో బౌలింగ్ వేశాడు. ఏకంగా ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా బౌలర్లు అంతగా ప్రభావం చూపించలేకపోయారు. కానీ ఇంగ్లాండ్ జట్టు విషయానికి వచ్చేసరికి ఆర్చర్ 2, కార్స్ 2, స్టోక్స్ 5 వికెట్లు సాధించి ఆతిథ్య జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. స్వల్ప స్కోర్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా ను గిరి గీసి నిలబెట్టారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 69 పరుగులు వెనుకబడి ఉంది.