Asia Cup 2023 : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న వివాదంతో ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి సందిగ్ధత ఏర్పడింది. ఆసియా కప్ ఈసారి పాకిస్తాన్ నిర్వహిస్తుండడంతో ఆ దేశంలో పర్యటించడం పట్ల భారత్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. పాకిస్తాన్ లో పర్యటించడం వల్ల భారత ఆటగాళ్లకు ఇబ్బందులు ఉన్నాయని, ప్రత్యామ్నాయ వేదికపై మ్యాచులు నిర్వహించాలంటూ భారత్ ప్రతిపాదించింది. అయితే పాకిస్తాన్ దీనిపై సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో ఆసియా కప్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, భారత్ కోరుకున్నట్లు పిసిబి హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి.. భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి బిసిసిఐ కూడా సానుకూలంగా స్పందించడంతో ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి మార్గం సుగమం అయింది.
ఈ క్రమంలోనే ఆసియా కప్ 2023 షెడ్యూల్ ను పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 30న టోర్నమెంట్ ప్రారంభం కొనంది. సెప్టెంబర్ 17 న ఫైనల్ మ్యాచ్ తో టోర్నీ ముగియనుంది. ఈ టోర్నమెంట్లో అత్యంత ఆసక్తికరమైన భారత్ – పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ రెండో తేదీన శ్రీలంకలోని కాండీ వేదికగా జరగనుంది. గ్రూప్ స్టేజిలో భారత జట్టు పాకిస్తాన్ తోపాటు నేపాల్ తో కూడా ఓ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 4వ తేదీన ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రపంచ కప్ కు ముందు జరగనున్న ఆసియా కప్ ఈసారి వన్డే ఫార్మాట్లో జరగనుంది. ఆసియా కప్ కు ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో శ్రీలంక పాకిస్తాన్ కలిసి ఆతిధ్యం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. టోర్నీ లో మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతుండగా శ్రీలంకలో తొమ్మిది, పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్ లన్ని శ్రీలంకలోనే జరుగుతాయి.
ఆసియా కప్ లో ఆడనున్న ఆరు జట్లు..
ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా.. రెండు గ్రూపులుగా విడగొడతారు. గ్రూప్-ఎ లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్-బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ ఉన్నాయి. ఆయా గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4 కు అర్హత సాధిస్తాయి. సూపర్ -4లో టాప్ లో నిలిచిన రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే టోర్నీలో భారత్ పాకిస్తాన్ మూడుసార్లు తలపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆగస్టు 30న జరగనున్న టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో పాకిస్తాన్ – నేపాల్ జట్లు పోటీ పడతాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు గ్రూపు దశ పోటీలు జరగనుండగా, సెప్టెంబర్ 6 నుంచి 15 వరకు సూపర్ 4 పోటీలు జరుగుతాయి. శ్రీలంకలోని కొలంబో వేదికగా సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్ తో టోర్నీ ముగియనుంది. ఆగస్టు 30న పాకిస్తాన్ – నెదర్లాండ్స్, 31న బంగ్లాదేశ్ – శ్రీలంక, సెప్టెంబర్ రెండో తేదీన పాకిస్తాన్ – ఇండియా, సెప్టెంబర్ మూడో తేదీన బంగ్లాదేశ్ – ఆఫ్గనిస్తాన్, సెప్టెంబర్ 4వ తేదీన ఇండియా – నెదర్లాండ్స్, సెప్టెంబర్ 5వ తేదీన శ్రీలంక – ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో ఫలితాలను బట్టి ఆ తరువాత సూపర్ ఫోర్ లో మెరుగైన స్థానాల్లో నిలిచిన జట్లు ఆడుతాయి.