Asia Cup 2025: సాధారణంగా ఒక క్రికెట్ టోర్నీ మొదలవుతోంది అంటే అభిమానుల్లో ఎక్కడా లేని ఆసక్తి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు కూడా స్పాన్సర్లుగా ఉండడానికి విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంటాయి. ఇక మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విస్తృతంగా కథనాలను ప్రసారం చేస్తూ ఉంటుంది. దీంతో టోర్నీ మీద విపరీతమైన హైప్ ఏర్పడుతుంది. మైదానాలలో చూసే ప్రేక్షకుల నుంచి మొదలు పెడితే టీవీలలో వీక్షించే అభిమానుల వరకు క్షణక్షణం ఉత్కంఠ కలుగుతుంది. ఎందుకంటే ఆట అనేది ఆనందం మాత్రమే కాదు.. అంతకుమించిన ఉద్వేగం కూడా.
మన దేశంలో క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి కలగడానికి పై ఉపోద్ఘాతంలో ఉన్న అంశాలే కారణం. క్రికెట్ ఒక మతం అయితే మన దేశం ఆ జాబితాలో ప్రధమ స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో ఆడే మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది.. ప్రస్తుతం భారత్ ఆసియా కప్ లో ఆడుతోంది. ఆసియా ఖండంలో ఉన్న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్.. ఇంకా మిగతా జట్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నాయి. ఈ టోర్నీ టి20 ఫార్మేట్లో సాగుతోంది. వాస్తవానికి టి20 విధానంలో సాగే మ్యాచ్లు ఉత్కంఠ గా ఉంటాయి. కానీ ప్రస్తుత ఆసియా కప్ మాత్రం అలాంటి మజా అభిమానులకు అందించలేకపోతోంది. ముఖ్యంగా భారత జట్టు లాంటి సూపర్ పవర్ ముందు మిగతా జట్లు తేలిపోతున్నాయి. ఇటీవల పాకిస్తాన్ భారత్ తలపడినప్పుడు కనీసం స్టేడియంలో సీట్లు కూడా నిండిపోలేదు. టీవీలలో కూడా అంతంతమాత్రంగానే విక్షణలు సొంతం చేసుకున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆసియా కప్ అనేది అర్థం లేనిదని.. ఈ టోర్నీ ముగించడమే మంచిదని అభిమానులు వాపోతున్నారు. ఎందుకంటే శ్రీలంక నుంచి మొదలు పెడితే ఆఫ్గనిస్తాన్ వరకు ఏ జట్టు కూడా భారత జట్టుకు కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది. చివరికి పాకిస్తాన్ కూడా దారుణంగా ఆడుతోంది. ఇలాంటి క్రమంలో ఆసియా కప్ నిర్వహించడంలో అర్థం లేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ అంటేనే భారత అభిమానులు మండిపడుతున్నారు. పహల్గాం ఘటన తర్వాత.. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత.. పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ అంటేనే భారత అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈసారి ఆసియా కప్ మీద ఆసక్తి తగ్గిపోవడానికి పహల్గం ఘటన కూడా ఒక కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరి దీనిపై ఏసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.. వచ్చే సీజన్లో ఆసియా కప్ నిర్వహిస్తుందా.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.