Asia Cup 2025 From September: క్రికెట్ లో హేమా హేమిల లాంటి జట్లు తలపడినప్పుడు వచ్చే కిక్కు వేరే విధంగా ఉంటుంది. ఆటగాళ్లకే కాదు అభిమానులకు కూడా ఆ హై ఓ రేంజ్ లో ఉంటుంది. బంతి బంతికి సమీకరణం మారిపోతుంది. ఓవర్ ఓవర్ కి మ్యాచ్ స్వరూపం అంచనాలకందకుండా సాగిపోతుంది. అందుకే ఆ ఆనందాన్ని అభిమానులు సొంతం చేసుకుంటారు. ఆ ఉత్కంఠను ఆస్వాదిస్తుంటారు. క్రికెట్లో అభిమానులకు ఆ స్థాయిలో ఉత్కంఠ కలిగించే జట్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఇంగ్లీష్, కంగారు జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ క్రికెట్ అభిమానులకు సరికొత్త ఆనందాన్ని అందిస్తుంది. అంతకంతకు ఉత్సాహాన్ని పెంచుతుంది. అందువల్లే ఈ యాషెస్ సిరీస్ అంటే క్రికెట్ అభిమానులకు అద్భుతమైన క్రికెట్ ఆనందం దక్కుతుంది.. దానికోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు.
ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మాత్రమే కాకుండా.. క్రికెట్ లో చిరకాల ప్రత్యర్థులుగా భారత్ – పాకిస్తాన్ జట్లు పేరుపొందాయి. ఈ జట్లు ఎప్పుడూ ఆడినా కూడా కొత్తగానే ఉంటుంది. ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటాయి. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఆ స్థాయిలో ఉంటాయి. అందువల్లే ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు వేలాదిమంది ప్రేక్షకులు మైదానాలకు పోటెత్తుతూ ఉంటారు.. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో మాత్రమే పోటీ పడుతున్నాయి. ఇక ఐసీసీ నిర్వహిస్తున్న మెగాటోర్నీలలో భారత్ ఏకపక్ష విజయాలు సాధిస్తోంది. ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో.. అంతకుముందు జరిగిన టీ 20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ లలో భాగంగా జరిగిన మ్యాచ్ లలో భారత్ విజయాలు సాధించింది.
భారత్ పాకిస్తాన్ పరస్పరం ద్వైపాక్షిక సిరీస్ ఆడే అవకాశం లేదు కాబట్టి.. ఈ రెండు జట్లు ఈ ఏడాది సెప్టెంబర్ లో యునైటెడ్ అరబ్ ఎమైరేట్స్ వేదికగా జరిగే ఆసియా కప్ లో తలపడే అవకాశం ఉంది. రెండు జట్లు సెప్టెంబర్ ఏడున పోటీ పడతాయి. టి20 విధానంలో ఈ లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ లో పోటీ పడ్డాయి. అమెరికా వేదికగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది.. ఇక పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత రెండో దేశాల మధ్య అంతర్గత సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.. ఒకవేళ ఈ మ్యాచ్ లో కనుక భారత్ గెలిస్తే జైత్రయాత్రకు తిరుగు ఉండదు. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి హై వోల్టేజ్ స్థాయిలో ఉత్కంఠ ఉంటుంది కాబట్టి.. ఈసారి జరిగే మ్యాచ్ కూడా అదే స్థాయిలో ఉంటుందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే రోజు మైదానంలో టికెట్లు హాట్ కేకుల మాదిరి అమ్ముడుపోతాయి. ఇక టీవీలలో రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదు అవుతాయి.