Ashwin: టీ-20 ప్రపంచ కప్ లో టీమిండియా తొలి రెండు మ్యాచులూ ఓడిపోవడం భారత అభిమానులకే కాదు.. అందరినీ నిరాశకు గురిచేసింది. భారత జట్టు సెమీస్ వరకు వస్తేనే.. టోర్నీ రసవత్తరంగా సాగుతుంది. అందుకే.. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా విజయాలతో దూసుకెళ్లాని అందరూ కోరుకుంటారు. కానీ.. పొట్టి ప్రపంచకప్ లో భారత్ కుదేలవడం నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో.. భారత్ సెమీస్ చేరడానికి ఉన్న అవకాశాలను అందరూ శోధిస్తున్నారు. అవన్నీ జరగాలను కూడా కోరుకుంటున్నారు.

టీమిండియా సెమీస్ కు వెళ్లాలంటే.. అఫ్గానిస్థాన్ ను భారీ తేడాతో ఓడించాల్సి ఉండగా.. ఆ పనిని పక్కాగా పూర్తి చేసింది. ఇక, మిగిలింది మన చేతిలో లేని అంశం. అదేమంటే.. న్యూజిలాండ్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో.. అఫ్ఘనిస్తాన్ జట్టు కివీస్ ను చిత్తు చేయాలి. ఈ అద్భుతం జరిగితే తప్ప, భారత్ సెమీస్ చేరడం సాధ్యం కాదు. అందుకే.. భారత ఫ్యాన్స్ సొంత జట్టు గెలవాలని కోరుకున్నట్టుగానే.. అఫ్ఘాన్ గెలవాలని కోరుకుంటున్నారు. పూజలు, పునస్కారాలు కూడా చేస్తున్నారు. కివీస్-అఫ్గాన్ మధ్య నవంబర్ 7న మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచుల తర్వాతే సెమీస్ చేరే జట్లపై పూర్తి క్లారిటీ రానుంది.
ఈ నేపథ్యంలోనే.. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. తాము సెమీస్ కు చేరే విషయం గురించి ఆలోచించట్లేదని చెప్పాడు. తమ ధ్యాస మొత్తం, మిగిలిన మ్యాచుల్లో ఎలా గెలవాలనే విషయం మీదనే ఉందని అన్నాడు. అదే సమయంలో.. ఆఫ్ఘన్-కివీస్ మ్యాచ్ పై భారీగా ఆశలు పెట్టుకున్నమని కూడా అన్నాడు అశ్విన్. అంతేకాదు.. అఫ్ఘాన్ జట్టుకు భారత అభిమానుల మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పాడు.
ఆ జట్టు చాలా బాగా ఆడుతోందని, ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పై ఆఫ్ఘన్ గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన తమకు.. గత మ్యాచ్లో గెలుపు రిలీఫ్ ఇచ్చిందన్న అశ్విన్.. భారత్ సెమీస్ చేరడానికి అన్నీ కలిసిరావాలని అన్నాడు. మరి, ఏం జరుగుతుంది? కివీస్ ను ఆఫ్ఘన్ ఓడిస్తుందా? భారత జట్టు సెమీస్ కు చేరుతుందా? అనే విషయం తేలాలంటే.. నవంబర్ 7న్ జరిగే మ్యాచ్ వరకు వెయిట్ చేయాల్సిందే.