Anand Mahindra On Siraj: సిరాజ్‌ పెర్ఫార్మెన్స్‌కు వ్యాపార దిగ్గజం ఫిదా.. ఓ కారు ఇవ్వొచ్చుకదా సార్‌..!

మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగిన భారత్‌ బౌలర్లు విజృంభించారు. శ్రీలంక టాప్‌ బ్యాంటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా నాలుగో ఓవర్‌లో భారత బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ కేవలం నాలుగు పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ 6 వికెట్లు సాధించాడు.

Written By: Raj Shekar, Updated On : September 18, 2023 8:53 am

Anand Mahindra On Siraj

Follow us on

Anand Mahindra On Siraj: భారత్‌–శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్‌–2023 ఫైనల్‌ మ్యాచ్‌ కొలొంబో వేదికగా ఈరోజు(సెప్టెంబర్‌ 17) జరుగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆతిథ్య జట్టు ఆల్‌అవుట్‌ అయింది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో ఆసియా కప్‌ భారత్‌ వశమైంది.

సిరాజ్‌ ‘సిక్సర్‌’..
మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగిన భారత్‌ బౌలర్లు విజృంభించారు. శ్రీలంక టాప్‌ బ్యాంటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా నాలుగో ఓవర్‌లో భారత బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ కేవలం నాలుగు పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ 6 వికెట్లు సాధించాడు.

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌..
మహమ్మద్‌ సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయ్యారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఒక పోస్ట్‌ పెట్టారు. సిరాజ్‌ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ మీరు ఒక మార్వెల్‌ అవెంజర్‌ అంటూ మహమ్మద్‌ సిరాజ్‌ను అభినందించారు. ఈ పోస్ట్‌ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ‘సార్‌.. సిరాజ్‌కు ఎస్‌యూవీ గిఫ్ట్‌ ఇచ్చేయండి’ అంటూ కోరగా దానికి ఆనంద్‌ మహీంద్ర స్పందిస్తూ కచ్చితంగా ఇస్తానంటూ పేర్కొన్నారు.

వన్డే క్రికెట్‌లో అతి భారీ విజయం
ఇదిలా ఉండగా ఆసియా కంప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత్‌.. అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 263 పరుగులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, వన్డే క్రికెట్‌ టోర్నీ ఫైనల్స్‌ చరిత్రలో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2003 వీబీ సిరీస్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా మరో 226 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌కు ముందు బంతుల పరంగా టీమిండియాకు అతి భారీ విజయం 2001లో కెన్యాపై దక్కింది. నాటి మ్యాచ్‌లో భారత్‌ 231 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

వన్డే టోర్నీ ఫైనల్స్‌లో మూడవది..
ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్‌.. ఓ వన్డే టోర్నీ ఫైనల్స్‌లో ఈ ఘనత (10 వికెట్ల తేడాతో విజయం) మూడో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఓ వన్డే టోర్నీ (కోకో కోలా కప్‌) ఫైనల్స్‌లో 1998లో భారత్‌ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాటి ఫైనల్స్‌ భారత్‌.. జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2003 వీబీ సిరీస్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది.

129 బంతుల్లో మ్యాచ్‌ ముగిసింది..
భారత్‌–శ్రీలంక మధ్య జరిగిన ఆసియాకప్‌ 2023 ఫైనల్స్‌ బంతుల పరంగా మూడో అతి చిన్న మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌ కేవలం 129 బంతుల్లో (రెండు ఇన్నింగ్స్‌) ముగిసింది. శ్రీలంక 15.2 ఓవర్లు.. భారత్‌ 6.1 ఓవర్లు బ్యాటింగ్‌ చేశాయి. బంతుల పరంగా అతి చిన్న మ్యాచ్‌ 2020లో నేపాల్‌–యూఎస్‌ఏ మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌ కేవలం 104 బంతుల్లో ముగిసింది.