Telugu News » Sports » Ambati rayudu made sensational allegations against msk prasad
Ambati Rayudu – MSK Prasad : ఎమ్మెస్కే ప్రసాద్ పై సంచలన ఆరోపణలు చేసిన అంబటి రాయుడు
శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ ను ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాకు ఆడించాలనేది వాళ్ళ అభిలాష అని తెలిపాడు. కానీ, అందుకు తాను అడ్డుగా ఉంటాననే భావనతో తన అడ్డు తొలగించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారని వివరించాడు.
Written By:
BS , Updated On : June 14, 2023 / 08:25 AM IST
Follow us on
Ambati Rayudu – MSK Prasad : ఇండియన్ క్రికెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వెలుగు వెలిగిన ఆటగాడిగా ప్రస్తుతం ఎవరి పేరైనా చెప్పాల్సి వస్తే.. అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది అంబటి రాయుడు. అత్యంత ప్రతిభ కలిగిన అంబటి రాయుడు సుదీర్ఘ కాలంపాటు ఐపీఎల్ ఆడాడు. భారత జట్టు కూడా అనేక మ్యాచ్ లు ఆడి తన సత్తాను చాటాడు. అయితే, వరల్డ్ కప్ ఆడే జట్టుకు 2019లో రాయుడు ఎంపిక అవుతాడని అంతా భావించినప్పటికీ అనూహ్యంగా ఆ జాబితాలో పేరు లేకుండా పోయింది. దీనిపై తాజాగా అంబటి రాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎక్కువ టైటిల్స్ సాధించిన జట్లలో సభ్యుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు తెలుగు తేజం అంబటి రాయుడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ కెరియర్ కొనసాగించిన రాయుడు.. ఈ ఏడాది చెన్నై జట్టు ట్రోఫీ గెలిచిన తర్వాత క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే రాజకీయంగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో 2019 వరల్డ్ కప్ జట్టు ఎంపిక సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
రాజకీయాలే కారణమని స్పష్ఠీకరణ..
తాజాగా ఓ మీడియా ఛానల్ తో అంబటి రాయుడు మాట్లాడుతూ దీనిపై కీలకమైన విషయాలను బయట పెట్టాడు. తనను 2019 వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడానికి రాజకీయాల కారణమని రాయుడు ఆరోపించాడు. తనను ఎంపిక చేయకపోవడానికి ఎమ్మెస్కే ప్రసాద్ ఒక్కడే కారణం కాదని, హైదరాబాద్ కు చెందిన ఒక ఆయన కారణమని వ్యాఖ్యానించాడు. 2019 వరల్డ్ కప్ కోసం తాను నాలుగేళ్ల ముందు నుంచే సన్నద్ధం అయ్యానని రాయుడు వివరించాడు. 2018లో బీసీసీఐ నుంచి వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ కావాలనే సంకేతాలు అందాయని, కానీ, 2019 వరల్డ్ కప్ కి ముందే తనను ఎంపిక చేయరనే సంకేతాలు కనిపించాయని రాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ సమయంలో విమానం దిగి ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే.. వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో తన పేరు లేదని తెలిసిందని రాయుడు పేర్కొన్నాడు. దీంతో తాను నిరాశ చెందినట్లు వివరించాడు. నాలుగో స్థానం కోసం తనను ఎంపిక చేయాలని అనుకున్నారని, కానీ ఆ స్థానానికి సరిపడే రహానే లాంటి మరో బ్యాటర్ ను తీసుకుంటే పరవాలేదు కానీ ఆల్రౌండర్ ను ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచిందన్నాడు. ఆరంభంలో వికెట్లు పడితే పరిస్థితిని చక్కదిద్దేందుకు నాలుగో స్థానంలో సీనియర్ ఆటగాడు కావాలని, ఆరేడు స్థానంలో బ్యాటింగ్ కు దిగే ఆల్రౌండర్ ను ఎంపిక చేశారని రాయుడు వివరించాడు. ‘విజయ్ శంకర్ మీద నాకు ఎలాంటి కోపం లేదు. పాపం తను ఏం చేశాడు. జట్టుకి ఎంపిక చేశారు. అతడు ఆడాడు. కానీ, వీళ్లు వరల్డ్ కప్ కి వెళ్తున్నారా..? లేదా లీగ్ మ్యాచ్ కు వెళ్తున్నారా అనిపించింది’ అని రాయుడు తెలిపాడు.
శివలాల్ యాదవ్ పై పరోక్షంగా ఆరోపణలు..
అంబటి రాయుడిని వరల్డ్ కప్ కి ఎంపిక చేయకపోవడానికి కారణం అప్పటి ఎంఎస్కే ప్రసాద్ అనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రాయుడు స్పందిస్తూ.. జట్టు ఎంపిక అనేది ఒక్కరి వల్ల కాదన్నాడు. మేనేజ్మెంట్ లోని కొందరు వల్లే ఇలా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ మేనేజ్మెంట్ లో హైదరాబాద్ కు చెందిన ఒక ఆయన ఉన్నాడని పరోక్షంగా శివలాల్ యాదవ్ పై రాయుడు ఆరోపణలు గుప్పించాడు. చిన్నప్పుడు జరిగిన పరిస్థితులు వల్ల గతంలో ఆంధ్రకు ఆడటానికి వెళ్లానని, అప్పుడు ఆంధ్ర జట్టుకు ఎమ్మెస్కే కెప్టెన్ గా ఉన్నాడని స్పష్టం చేశాడు. అప్పుడు ఆయన చేసిన పనులు నాకు నచ్చలేదని దీంతో మళ్లీ హైదరాబాద్ కు వచ్చేసినట్లు రాయుడు వివరించాడు. ఆయన ఆలోచన విధానం, ఆటను చూసే తీరు, పనులు అప్పట్లో నాకు నచ్చలేదని రాయుడు పేర్కొన్నాడు. తనను వరల్డ్ కప్ కి ఎందుకు ఎంపిక చేయలేదో ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాలని రాయుడు అభిప్రాయపడ్డాడు. హెచ్సీఏలో తన చిన్నప్పటి నుంచి రాజకీయాలు మొదలయ్యాయి అన్న రాయుడు.. శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ ను ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాకు ఆడించాలనేది వాళ్ళ అభిలాష అని తెలిపాడు. కానీ, అందుకు తాను అడ్డుగా ఉంటాననే భావనతో తన అడ్డు తొలగించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారని వివరించాడు. అప్పటికి తన వయసు 17 ఏళ్లు మాత్రమేనని రాయుడు స్పష్టం చేశాడు.
ముందు అర్జున్ ఎంపిక కావాలని వేడుకున్న..
ముందు అర్జున్ టీమ్ ఇండియాకు ఎంపికైనా బాగుందేదని దేవున్ని అనేకసార్లు మొక్కుకున్నానని రాయుడు వివరించాడు. ఇండియాకు ఆడటం వాడి వల్ల కాలేదని, దానికి మనమేం చేస్తామని స్పష్టం చేశాడు రాయుడు. హెచ్సిఏలో నా చిన్నతనంలోనే క్యాన్సర్ మొదలైందని, ఇప్పుడు అది నాలుగో స్టేజ్ కు వచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు అంబటి రాయుడు. బిసిసిఐ జోక్యం చేసుకుంటేనే తప్ప పరిస్థితి మారదని స్పష్టం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు మారిన తర్వాతే నన్ను బాహుబలిగా పిలవడం మొదలు పెట్టారని, సిక్సర్లు ఎక్కువగా కొడతానని వివరించాడు. తెలుగు ఆటగాన్ని కావడంతోనే బాహుబలి అని పిలవడం మొదలు పెట్టారని, ఇన్నేళ్లపాటు క్రికెట్ ఆడినందుకు గుర్తింపుగా ధోని నన్ను వేదిక మీదకు పిలిచి ట్రోఫీని అందుకోమని చెప్పినట్లు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ధోని చాలా సింపుల్ గా ఉంటాడని, ఎక్కువగా బయటకు వెళ్లడని, తాను కూడా ధోనీలాగే ఫోన్ ఎక్కువగా వాడనని రాయుడు స్పష్టం చేశాడు.