IPL2023 : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సంవత్సరాల విరామం తర్వాత ఉప్పల్ లో హైదరాబాదీయులు ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు.. 16వ ఎడిషన్ లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఆదివారం జరిగే మ్యాచ్ లో రాజస్థాన్ జట్టుతో తలపడనుంది. సొంత మైదానంలో రాజస్థాన్ జట్టుపై గెలవాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతున్నది.
2020లో ప్లే ఆఫ్ కు చేరిన రైజర్స్ .. ఆ తర్వాత పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురిచేసింది. 2021లో అయితే వార్నర్ కెప్టెన్సీలో అట్టడుగునా నిలిచింది. గత ఏడాది విలియమ్సన్ కెప్టెన్సీ లోనూ పెద్దగా మార్పు రాలేదు. పది జట్ల లీగ్ లో ఈ ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి మార్ క్రమ్ కెప్టెన్ గా వచ్చాడు.. ఈసారైనా జట్టు రైజింగ్ లో ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.
గత సిరీస్ లో రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. గత సీజన్లో పర్పుల్ క్యాప్( చాహల్), ఆరెంజ్ క్యాప్ ( బట్లర్) ప్లేయర్లు ఈ జట్టులోనే ఉండటం విశేషం. జైస్వాల్, దేవ్ దత్, శాంసన్, హెట్ మేయర్ లతో కూడిన ఈ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా కనిపిస్తోంది..చాహల్, జంపా, అశ్విన్ తో కూడిన బౌలింగ్ దళం ఈ జట్టుకు ప్రధాన బలం.. అందుకే తొలి మ్యాచ్లో బలమైన హైదరాబాదును మట్టి కరిపించి బోణీ చేస్తామని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇక హైదరాబాద్ జట్టు విషయానికొస్తే అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ మార్ క్రమ్, బ్యాటర్ క్లాసెన్, పేసర్ జాన్సన్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ కు దూరమయ్యారు. అయితే ఈ మ్యాచ్ కు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ వహించనన్నాడు. భువనేశ్వర్ కుమార్ కు ఏడు మ్యాచ్లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. కీలక ఆటగాళ్లు లేకపోవడంతో జట్టుకూర్పు కూడా కష్టంగానే కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. గత ఏడాది పంజాబ్ కెప్టెన్ గా ఉన్న మయాంక్ మార్చిలో జరిగిన ఇరానీకప్పులో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అయితే జట్టులోకి కొత్తగా వచ్చిన హ్యారీబ్రూక్, గెన్ పిలి ప్స్ తో మిడిల్ ఆర్డర్ కొంచెం పటిష్టంగా కనిపిస్తోంది.
ఇక పేసర్లు ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, నటరాజన్ లతో కూడిన బౌలింగ్ దళం కొంచెం మెరుగ్గా కనిపిస్తోంది. వీరి పైనే హైదరాబాద్ జట్టు ఆధారపడి ఉంది. మరోవైపు స్పిన్నర్లు ఆదిల్ రషీద్, సుందర్ వైవిధ్యమైన బంతులు వేస్తూ బ్యాటర్లకు పరీక్ష పెట్టగలరు.
ఇక ఉప్పల్ మైదానం బౌలర్లకు అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ వైపు మొగ్గు చూపవచ్చు. ఇక్కడ చేజింగ్ చేసిన జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జట్ల అంచనా ఇలా
హైదరాబాద్
మయాంక్, అభిషేక్ శర్మ, త్రిపాఠి, బ్రూక్, ఫిలిప్స్, సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్ ( కెప్టెన్), అదిల్ రషీద్, ఉమ్రాన్, నటరాజన్.
రాజస్థాన్
జైస్వాల్, బట్లర్, దేవ్ దత్, శాంసన్( కెప్టెన్), హెట్ మెయిర్, పరాగ్, అశ్విన్, మేకాయ్, బౌల్ట్, చాహల్, కులదీప్ సేన్.